రాజ కుటుంబాలకు కంచుకోటగా గుణ జిల్లా
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఉప సంహరణకు రేపే డెడ్‌లైన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అందులోనూ గుణ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లపైనే అందరి చూపు ఉంది. రాజ కుటుంబాలకు కంచుకోటగా ఉన్న గుణ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నది. జిల్లాలో రఘోఘర్, చచౌరా, బమోరి, గుణ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండు సెగ్మెంట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఫ్యామిలీ చేతిలో ఉండగా.. మిగిలిన రెండింటిలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దిగ్విజయ్ సింగ్.. ఓల్డ్ గ్వాలియర్ స్టేట్‌లోని రఘోఘర్ సంస్థానానికి చెందినవాడు.
కేంద్ర మంత్రి, బీజేపీ లీడర్ జ్యోతిరాదిత్య సింధియా.. రాయల్ ఫ్యామిలీ వారసుడు. 2002లో మాజీ కేంద్ర మంత్రి, తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో చనిపోవడంతో జ్యోతిరాదిత్య సింధియా ఫస్ట్ టైమ్ గుణ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందాడు. దిగ్విజయ్ సింగ్(1993–2003 వరకు) సీఎంగా ఉన్నప్పుడు మాధవరావు సింధియాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో సింధియా వర్సెస్ సింగ్ పోరు మొదలైంది.
1977 నుంచి పవర్లో దిగ్విజయ్ ఫ్యామిలీ
1977 నుంచి రఘోఘర్ స్థానానికి సింగ్ ఫ్యామిలీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. 1985, 2008లో మాత్రమే సింగ్ అనుచరుడు లెఫ్టినెంట్ మూల్ సింగ్ గెలిచాడు. రెండు టర్మ్‌ల నుంచి దిగ్విజయ్ సింగ్ కొడుకు జయవర్ధన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దిగ్విజయ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ చచౌరా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజ్‌గఢ్ ఎంపీగా ఐదు సార్లు, ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచాడు. ఈ రఘోఘర్, చచౌరాలు రాజ్‌గఢ్(బీజేపీ సిట్టింగ్) లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వస్తాయి. 1957 నుంచి గుణ లోక్‌సభ స్థానానికి సింధియా ఫ్యామిలీ ప్రాతినిథ్యం వహిస్తున్నది.
ఈ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ స్థానాలుండగా.. వాటిలో ఆరు బీజేపీ, రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేపీ యాదవ్ చేతిలో జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోయారు. తర్వాత 2018లో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో వెళ్లిపోయారు. దీంతో గుణ జిల్లాలో ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా.. సింధియా వర్సెస్ సింగ్‌గా ఉన్నాయి.
ఎగ్జామ్ ఫీజు మేమే పే చేస్తాం: కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ నియామక పరీక్ష ఫీజు తమ పార్టీయే కడ్తుందని కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య మంగళ వారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని, 40 లక్షల మంది మాత్రమే నిరుద్యోగులుగా రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో ఫీజుల రూపంలో 100 కోట్లు వసూలు చేసిందన్నారు. 18 ఏండ్లలో 17,298 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
కాగా, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు 3,832 మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలై 30వ తేదీతో ముగిసింది. మంగళవారం స్క్రూటినీ, నవంబర్ 2 దాకా నామినేషన్ల ఉప సంహరణ, 17న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.