నవంబర్ 3 నుంచి నామినేషన్ల పర్వం : కలెక్టర్​ ఆర్​వీ.కర్ణన్​

నల్గొండ అర్బన్, వెలుగు:  జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్​ అధికారి, కలెక్టర్​ ఆర్​వీ.కర్ణన్​ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో ఎస్పీ అపూర్వ రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. 13న  స్ర్కూట్నీ,  15న నామినేషన్ల విత్​డ్రా ఉంటుందన్నారు. 30న పోలింగ్​ జరుగుతుందన్నారు. డిసెంబర్​3 న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. అన్ని ఆర్​ఓ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. నామినేషన్​ సందర్భంగా మూడు వాహనాలు, అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు.  

ఆన్​లైన్​లో నామినేషన్లు, పర్మిషన్లకు సంబంధించి సేవలు పొందవచ్చన్నారు.  జిల్లాలో మొత్తం 14,45,855 మంది ఓటర్లు ఉన్నారన్నారు.  జిల్లా వ్యాప్తంగా 10,766 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీ విజిల్​ ద్వారా మొత్తం 206 కేసులు నమోదు చేసి నగదు, వస్తువులను సీజ్​ చేశామన్నారు. అందులో 196 కేసులు పరిష్కారం కాగా 10 కేసులు పెండింగ్​లో ఉన్నాయన్నారు.  ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ ప్రతి ఆర్​ఓ కేంద్రం వద్ద 144 సెక్షన్​ అమలులో ఉంటుందని, ఐదుగురికంటే ఎక్కువగా గుమిగూడరాదన్నారు.  నామినేషన్ల ప్రక్రియకు పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా రూ.41 కోట్ల నగదు, లిక్కర్​, వస్తువులను సీజ్​ చేశామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్, సీఆర్​పీఎఫ్ బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టామన్నారు. నేటి నుంచి ఇంటర్​ డిస్ర్టిక్ట్, ఇంటర్ స్టేట్​ చెక్​పోస్టుల ద్వారా తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామన్నారు. ఇబ్బందులు, ఫిర్యాదులుంటే సీ విజిల్​తో పాటు డయల్​ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికలకు ఇబ్బందులను సృష్టిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం 

తుంగతుర్తి : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తుంగతుర్తి నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం  మండల కేంద్రంలోని తహశీల్దార్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.  తుంగతుర్తిలోనే నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామన్నారు.  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు స్వీకరిస్తామన్నారు.  అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లు మాత్రం వేయవచ్చన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు నలుగురిని మాత్రమే  లోపలకు అనుమతిస్తామన్నారు. 11న దరఖాస్తుల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.  సమావేశంలో  యాదగిరి రెడ్డి,  హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

హుజూర్ నగర్ లో పటిష్టమైన ఏర్పాట్లు

హుజూర్ నగర్ , వెలుగు:నామినేషన్ల కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. పట్టణంలోని నామినేషన్​ కేంద్రంలో ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి గురువారం పరిశీలించారు . ఈ సందర్భంగా  మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమయ్యే   నామినేషన్ల ప్రక్రియను వీడియో తీస్తున్నామన్నారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే లోనికి అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలన్నారు.  కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి  జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు , తహశీల్దార్ నాగార్జున రెడ్డి  పాల్గొన్నారు . 

ALSO READ : తెలంగాణలో రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే : పొన్నం ప్రభాకర్