ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బుధవారం అత్యధికంగా 33 మంది నామినేషన్లు వేశారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 17 నామినేషన్లు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నూర్ నుంచి ప్రజారాజ్య పార్టీ అభ్యర్థిగా సల్లూరి మహేశ్, స్వతంత్ర అభ్యర్థిగా జుమ్మిడి గోపాల్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సోగాల సంజీవ్, తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యర్థిగా వడ్లకొండ రాజం నామినేషన్లు వేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా తోట శ్రీనివాస్, యుగ తులసి క్యాండిడేట్గా సౌల్ల సందీప్, స్వతంత్ర అభ్యర్థులుగా తాళూరి వెంకటేశ్వర్లు, రంగు మల్లేశం, ఎండీ నయీం పాషా, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా గొర్లపల్లి సురేశ్ ఎన్నికల అధికారికి తమ నామినేషన్లు అందించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా జంగపెల్లి రామస్వామి, స్వతంత్ర అభ్యర్థులుగా కొండగుర్ల వేద ప్రకాశ్, పెరుగు రవీందర్ నామినేషన్లు దాఖలు చేశారు.
భారీ ర్యాలీల నడుమ..
ఆదిలాబాద్ స్థానానికి 9, బోథ్ స్థానానికి 2 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్లో బీఆర్ఎస్అభ్యర్థిగా జోగు రామన్న, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీల నడుమ ఎన్నికల కేంద్రానికి చేరుకొని అధికారులకు తమ నామినేషన్లు అందించారు. ప్రజా ఎక్తా నుంచి కేమ శ్రీనివాస్, డీఎస్పీ నుంచి అగ్గిమల్ల గణేశ్, బీఎస్పీ నుంచి ఉయిక ఇందిర, బహుజన్ముక్తి నుంచి సూర్యవంశి విద్యాసాగర్, స్వతంత్ర అభ్యర్థులుగా అస్లాం, ఎన్.సుభాశ్, భాను రాజేశ్వర్రావు, బోథ్ స్థానానికి డీఎస్పీ నుంచి ఉయికె ఉమేశ్, స్వతంత్ర అభ్యర్థిగా తొడసం ధనలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ బీజేపీ అభ్యర్థి అజ్మీర ఆత్మారాం నాయక్ నామినేషన్ పత్రం దాఖలు చేయగా, రెండో సెట్ ఆయన సతీమణి, ఖైరిగాం సర్పంచ్ సంధ్య దాఖలు చేశారు. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నునావత్ తిరుపతి నామినేషన్ పత్రాలను ఆసిఫాబాద్ రిటర్నింగ్ అధికారి దాసరి వేణుకు అందజేశారు. సిర్పూర్లో బీజేపీ అభ్యర్థి హరీశ్ బాబు తరుఫున కోండ్ర మనోహర్ గౌడ్ నామినేషన్ వేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ నామినేషన్ దాఖలు చేశారు.