తెలంగాణలో నామినేషన్లకు కౌంట్ డౌన్.. 3 నుంచి ప్రారంభం

తెలంగాణలో నామినేషన్లకు కౌంట్ డౌన్.. 3 నుంచి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టాన్ని కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే అంటే.. 2023 నవంబర్ 3వ తేదీ.. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు సెకండ్, థర్డ్ లిస్టులు రిలీజ్ చేశాయి. కొన్ని సీట్లలో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసి.. బీఫాంలు ఇవ్వాలని నిర్ణయించాయి. సమయం ఎక్కువగా లేకపోవటంతోపాటు ప్రచారంపై దృష్టి పెట్టటానికి రెడీ అవుతున్నాయి పార్టీలు. టికెట్ రాని అభ్యర్థుల బుజ్జగింపులతోపాటు పొత్తుల్లోని పార్టీలతో చర్చలను.. వీలైనంత త్వరగా ముగించాలని డిసైడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల గడువు అయిన నవంబర్ 3వ తేదీని దృష్టిలో పెట్టుకుని.. 2వ తేదీ సాయంత్రంలోగా అన్ని పార్టీలు.. అభ్యర్థులను ప్రకటించే పనిలో కసరత్తులు చేస్తున్నాయి.

  • నోటిఫికేషన్ తేదీ - నవంబర్ 03
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - నవంబర్ 10
  • నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 15
  • నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. 
  • కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది.
  • పోలింగ్ - నవంబర్ 30
  • ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 03

ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సగం నియోజకవర్గాలను ఇప్పటికే కవర్ చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా పొత్తులు, అభ్యర్థుల జాబితాతోనే సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ 100 మంది అభ్యర్థులను ప్రకటించి మరో 19  మందిని ఫైనల్ చేసే పనిలో పడింది.  ఇంకా సీపీఐ, సీపీఎంతో పొత్తులు లెక్కకు రాలేదు. ఇక 54 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన బీజేపీ.. జనసేనతో పొత్తు,  సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుపుతుంది.  మరోవైపు తెలంగాలో అన్ని స్థానాల్లో బరిలో నిలుస్తామని ప్రకటించిన వైఎస్ షర్మిల ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. బీఎస్పీ సైతం ఇంకా 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.