న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో హాజరుకాకపోవడంపై యోగా గురు బాబా రామ్ దేవ్, పతంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. పలు వ్యాధులకు తమ ఉత్పత్తులు వాడితే, ఆరోగ్యం మెరుగవుతుందంటూ పతంజలి ఆయుర్వేద కంపెనీ అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇచ్చిందని కేరళ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ గతంలో కేసు వేశారు.
ఈ కేసులో ఈనెల 1న రామ్ దేవ్, బాలకృష్ణ హాజరు కావాల్సి ఉంది. కానీ, వారు గైర్హాజరు కావడంతో కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈనెల 15 లోపు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దివ్య ఫార్మసీని ఏ1గా, బాలకృష్ణను ఏ2గా, రామ్ దేవ్ ను ఏ3గా పేర్కొంది.