ప్రభాకర్ రావుపై నాన్​బెయిలబుల్ వారెంట్

ప్రభాకర్ రావుపై నాన్​బెయిలబుల్ వారెంట్
  • జారీ చేసిన నాంపల్లి కోర్టు
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్​కు రంగం సిద్ధం
  • రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పోలీసులు
  • ఇంటర్​పోల్ ద్వారా ఇండియాకు రప్పించే అవకాశం
  • ఓ చానెల్ ఎండీ శ్రవణ్​కుమార్​పై కూడా వారెంట్ జారీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఫోన్ ట్యాపింగ్, లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఓ చానెల్ ఎండీ శ్రవణ్ కుమార్​పై నాంపల్లి కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో సీబీఐ నమోదు చేసిన ఓ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు ఆధారంగా సెక్షన్ 73 సీఆర్పీసీ కింద వారెంట్స్ ఇష్యూ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వీరంతా చంచల్​గూడ జైల్లో ఉన్నారు. వీరి వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన మాస్టర్ మైండ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అనారోగ్యం కారణంగా ట్రీట్​మెంట్ కోసం ఫిబ్రవరి 15న యూఎస్ వచ్చినట్టు ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జూన్ 26న హైదరాబాద్​కు తిరిగి వస్తానని చెప్పాడు.

ఇప్పటికే లుక్​ఔట్ సర్క్యూలర్ జారీ

అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ (ఆర్ఎన్) జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రొసీజర్​ను ప్రారంభించారు. ఇందుకుగాను వారెంట్ తప్పనిసరి కావడంతో కోర్టును ఆశ్రయించారు. వారెంట్​ను ఇమ్మిగ్రేషన్ ఇంటర్​పోల్ అధికారులకు పంపించనున్నారు. అక్కడి నుంచి అమెరికా పోలీసుల ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేస్తారు. దీంతో రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నవారిని సంబంధిత దేశానికి చెందిన ఇంటర్​పోల్, లోకల్ పోలీసులు అరెస్ట్ చేసి ఇండియాకు పంపిస్తారు. కాగా, ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి.. ఆయన్ను ఇండియాకు రప్పించే ఆలోచనలో ఇక్కడి పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. న్యాయ స్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. 

ఇప్పటికే విచారణలో కీలక వివరాలు వెలుగులోకి

పోలీస్‌‌‌‌ కస్టడీలో ఉన్న నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు టీమ్ పనిచేసినట్లు ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో బయటపడింది. ఈ క్రమంలోనే ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు స్టేట్‌‌‌‌మెంట్స్ ఇవ్వడంతో ఆయన అరెస్ట్‌‌‌‌ కీలకంగా మారింది. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలుగు చూసే అవకాశాల్లేవు. దీంతో అమెరికాలో ఉన్న ఆయన్ను ఇక్కడికి రప్పించేందుకు పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రభాకర్ రావు నోరు విప్పితే గత ప్రభుత్వ పెద్దలకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకునే అవకాశాలున్నాయి.