రింగ్ రోడ్డు చుట్టూ.. రైల్వే బైపాస్​ గుబులు

  • రింగ్ రోడ్డు చుట్టూ.. రైల్వే బైపాస్​ గుబులు..
  • వరంగల్ లో ఎన్​హెచ్–​163 పొడవున నాన్​లేఅవుట్​వెంచర్లు
  • ప్లాట్లు కొన్న వేల మంది జనాలు
  • తాజాగా నష్కల్​టు ఎల్లాపూర్​రైల్వే బైపాస్ కోసం సర్వే 
  • ప్రతిపాదిత రూట్ లో వందలాది ప్లాట్లు గల్లంతయ్యే అవకాశం
  • అలైన్ మెంట్ మార్చాల్సిందిగా వేడుకోలు

హనుమకొండ, వెలుగు : వరంగల్ రింగ్​రోడ్డు (ఎన్​హెచ్​163 బైపాస్) చుట్టూ ఉన్న నాన్ లేఅవుట్లు, ఓపెన్ ప్లాట్లకు రైల్వే బైపాస్​లైన్ గుబులు పట్టుకుంది. 5ఏళ్ల కిందట ప్రతిపాదించిన రైల్వే బైపాస్​ తాజాగా తెరమీదకు రావడం, రింగ్ రోడ్డుకు సమాంతరంగా వెళ్తున్నట్లు ఆఫీసర్లు డిజిటల్ మ్యాప్​రిలీజ్ చేయడంతో​ చాలామందిలో టెన్షన్ మొదలైంది. అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాలు కొనుక్కున్న ప్లాట్లు ఈ బైపాస్​లైన్​కింద పోయే అవకాశం ఉండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో బైపాన్​అలైన్​మెంట్​మార్చాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ మేరకు లీడర్లు, ఆఫీసర్లకు వినతులు సమర్పిస్తున్నారు.

రింగ్​రోడ్డుకు సమాంతరంగా..

సౌత్ సెంట్రల్​రైల్వేలో ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే వారధి కాజీపేట జంక్షన్.​ వందలాది టైన్ల రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. గూడ్స్​రైళ్లు స్టేషన్​లోకి రాకుండా మళ్లించేందుకు నష్కల్​టు ఎల్లాపూర్, అక్కడి నుంచి వంచనగిరి వరకు రైల్వే బైపాస్​లు ప్రతిపాదించారు. కొద్దిరోజుల కింద నష్కల్​టు ఎల్లాపూర్​ లైన్​కోసం ఆఫీసర్లు 25 కిలోమీటర్ల మేర డిజిటల్​సర్వే చేపట్టారు. డిజిటల్​సర్వే మ్యాప్​ప్రకారం రైల్వే బైపాస్​ లైన్​ నష్కల్​నుంచి పెద్దపెండ్యాల శివారు, కొంతదూరం వరంగల్ రింగ్​రోడ్డుకు సమాంతరంగా వెళ్తోంది. ఆ మార్గంలోని రాంపూర్, ధర్మసాగర్, ఉనికిచెర్ల, దేవన్నపేట, భీమారం, చింతగట్టు శివారు వరకు, అక్కడి నుంచి కాజీపేట-బల్లార్షా లైన్​కు ఆనుకొని ఉన్న ఎల్లాపూర్​వరకు పట్టాలు వేయాల్సి ఉంది.

పట్టాల కిందికి ప్లాట్లు..

వరంగల్ రింగ్​రోడ్డుకు ఆనుకొని వందల్లో నాన్​లేఅవుట్​వెంచర్లు వెలిశాయి. చుట్టుపక్కల ఉన్నవన్నీ గ్రేటర్​విలీన గ్రామాలే కావడంతో నాన్​లేఅవుట్లపై ఆఫీసర్లు పెద్దగా దృష్టి పెట్టలేదు. డెవలప్ మెంట్ పరంగా డిమాండ్​ఉన్న ఏరియా కావడంతో చాలా మంది ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశాయి. ఆఫీసర్ల నుంచి వచ్చిన డిజిటల్​మ్యాప్​ప్రకారం రైల్వే లైన్​కింద వేల మంది ప్లాట్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చే అవకాశం ఉన్నా.. మార్కెట్ రేట్ ప్రకారం ఉండదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ​అంతగా డిమాండ్ లేని మడిపెల్లి, జయగిరి శివార్ల మీదుగా రైల్వే బైపాస్ ను మళ్లించాలని బాధితులు కోరుతున్నారు.

పేదల భూములు పోతున్నయ్​

 ఎంతో  మంది పేదలు రింగ్​రోడ్డు చుట్టూ ప్లాట్లు కొన్నరు. ఇప్పుడు ఈ జాగలళ్ల రైల్వే బైపాస్​లైన్​వేస్తే వాళ్లంతా తీవ్రంగా నష్టపోతరు. బైపాస్ ను నష్కల్​నుంచి ఉనికిచెర్ల, మడిపెల్లి, జయగిరి, చింతగట్టు, మునిపెల్లి శివార్ల మీదుగా వేస్తే ఇటు పబ్లిక్​కు, అటు గవర్నమెంటోళ్లకు మంచిది.
- పోలపెల్లి రాజు, దేవన్నపేట