- ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచుతూ దొరికిన రూలింగ్ పార్టీ నేతలు
- పైసల కోసం లీడర్ల ఇండ్ల ముందు ఓటర్ల పడిగాపులు
నల్గొండ / యాదాద్రి / సూర్యాపేట, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు కూడా స్థానికేతరులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దీంతో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా రూలింగ్ పార్టీ నేతలు చివరి క్షణం వరకు ఓటర్లకు బహిరంగంగానే డబ్బు పంపిణీ చేశారు. చాలా చోట్ల నాన్ లోకల్ నాయకులు తమ పార్టీకి ఓటు వేసేలా ఓటర్లకు పైసలు ఇచ్చారు. మరోవైపు కొందరు ఓటర్లు తమకు డబ్బు అందలేదని, పైసల్లేకుండా ఓటు ఎలా వేయాలని నిరసన తెలిపారు.
పోలింగ్ సెంటర్ దగ్గరే
చౌటుప్పల్ లో పటాన్ చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ పోలింగ్ సెంటర్ సమీపంలో కూర్చొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. వెంటనే స్థానికేతరులను పంపించాలని డిమాండ్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారన్న ప్రచారం జరిగింది. మరికొందరు మంత్రులు కూడా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడులకు ఆనుకుని ఉన్న ఇతర మండలాల పరిధిలో ఉంటూ పోలింగ్వ్యవవహారాలను పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఒక బూత్దగ్గర పటాన్‌చెరుకు చెందిన పలువురు టీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేస్తుండగా బీజేపీ, కాంగ్రెస్కార్యకర్తలు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. గొడవ గురించి తెలిసి పోలీసులు వచ్చేలోగా వారు పారిపోయారు. కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుడు, నేరేడుచెర్ల వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణతో బీజేపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. లక్ష్మీనారాయణను ఓ బీజేపీ లీడర్ గల్లా పట్టుకొని కొట్టారు. పంతంగిలో ప్రచారం చేస్తున్న హుజూర్నగర్ టీఆర్ఎస్ లీడర్లనూ బీజేపీ కార్యకర్తలు అడ్డకుని నిలదీశారు. పోలీసులు వచ్చి టీఆర్ఎస్వాళ్లను పంపించేశారు.
కూసుకుంట్ల అనుచరుడి ఇంట్లో..
గట్టుప్పల్ లోని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు బొడిగె వెంకటేశం ఇంట్లో అధికారులు సోదాలు చేసి రూ.10లక్షల నగదు,మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పైసలియ్యలే.. ఓటు ఎట్లా వేయాలే..
తమకు ఏ పార్టీ పైసలు అందలేదని, ఇక తాము ఎందుకు ఓటెయ్యాలని నాంపల్లిలో పలువురు వృద్ధ మహిళలు నిరసన తెలిపారు. కొందరికి ఇచ్చి మాకెందుకు ఇవ్వరని, చండూరు మున్సిపాలిటీలో పలువురు ఓటర్లు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ ఇంటి వద్ద పడిగాపులు కాశారు. డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని భీష్మించారు. గట్టుప్పుల్ మండలం అంతంపేట, సోమరాజుగూడ గ్రామాలకు చెందిన పలువురు ఓటర్లు ముంబైలోని ఓ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు. మునుగోడు వచ్చి ఓటేస్తే తలా రూ.3వేలు, రానుపోను చార్జీలు ఇస్తామని టీఆర్ఎస్ లీడర్లు అంటే వచ్చామని, కానీ నాలుగు రోజులువుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామని ఆశ చూపి తర్వాత మోసం చేశారని ఫైర్ అయ్యారు.