న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయల్ రూల్స్ మార్చింది. కరోనా వల్ల ఇబ్బందులు వస్తే పీఎఫ్ ఖాతాదారులు వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఖాతా నుండి నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కరోనా మహమ్మారి బారిన పడిన ఈపీఎఫ్ఓ సభ్యులకు సహాయం చేయడానికే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సమస్యల వల్ల డబ్బు అవసరమైందని పేర్కొంటూ ఈపీఎఫ్ఓ చందాదారుడు పీఎఫ్ / ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పీఎఫ్ విత్‌డ్రాయల్ రూల్స్ మార్పుపై సెబీ రిజిస్టర్డ్ టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్ పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, "కోవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఈపీఎఫ్ఓ సభ్యులు అడ్వాన్స్ పొందే సదుపాయం అందుబాటులో ఉంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు మూడు నెలల బేసిక్ పే, డీఏ, పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం.. వీటిలో ఏది తక్కువగా ఉంటే దానిని ఇస్తారు. ఫస్ట్ వేవ్ కాలంలో ఈ సదుపాయాన్ని పొందిన ఈపీఎఫ్ఓ సభ్యులకు కూడా మళ్లీ పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు”అని సోలంకి చెప్పారు. కొత్త రూల్స్ ప్రకారం ఆన్‌లైన్ పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్‌ను 3 రోజుల్లో పరిష్కరిస్తారు. అయితే ఆఫ్‌లైన్ పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్ కు 20 రోజులు పడుతుంది.
యూఏఎన్ తప్పనిసరి
ఆన్‌లైన్ పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్ కోసం ఆధార్, పాన్ , బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన యూఏఎన్ నంబరు అవసరం. యూఏఎన్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ పనిచేయాలి. దానికి ఓటీపీ తప్పకరావాలి. ఆన్‌లైన్ పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్‌కు మీ ఎంప్లాయర్ నుండి అనుమతి కావాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.