మక్కలు కొనేదెన్నడో..ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రైతులు పండించిన ప్రతీ గింజను సర్కార్​కొంటుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో కనిపించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను గవర్నమెంట్​ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని తక్కువ ధరకే రైతుల నుంచి మక్కలు కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే నాటికి రైతుల వద్ద ఉన్న మక్కలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్న పంటనంతా అమ్ముకున్నంక దళారులకు మేలు చేసేందుకు సెంటర్లు తెరుస్తరా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన మక్కలనే రైతుల పేర దళారులు మార్క్​ఫెడ్​ఏర్పాటు చేయబోయే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్మనున్నారు.  దీంతో దళారులకే ‘మద్దతు’ దక్కే పరిస్థితి నెలకొంది.

దళారులకు మద్దతు ధర

ప్రభుత్వం గతేడాది మార్క్​ఫెడ్ ద్వారా మక్కలు కొనలేదు. ఈసారి మక్కలు కొంటామని చెబుతున్నా.. మే నెల గడుస్తున్నా కేంద్రాలను ప్రారంభించలేదు.  జిల్లాలో 11,749 మంది రైతులు 28,496 ఎకరాల్లో మక్కలు పండించారు. 85,489 మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తొందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు. ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, లక్ష్మీదేవిపల్లి, గుండాల, సుజాతనగర్, జూలూరుపాడు, ముల్కలపల్లి,చండ్రుగొండ, పాల్వంచ, ఆళ్లపల్లి తదితర మండలాల్లో మక్కను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రభుత్వం మక్కలకు క్వింటాకు రూ.1,962 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో దళారులకు మాయమాటలు చెప్పి వారి నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. మద్దతు కంటే తక్కువగా రూ.1650 నుంచి రూ. 1,800 వరకు ధర చెల్లిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 40 నుంచి 50 వేల మెట్రిక్​టన్నులకు పైగా మక్కలను దళారలు కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే నాటికి రైతుల వద్ద అరకొరగానే మక్కలుండే పరిస్థితి కనిపిస్తోంది. దళారులు తాము కొనుగోలు చేసిన మక్కలను రైతుల పేరు మీదే ప్రభుత్వానికి అమ్మి జేబులు నింపుకొనే అవకాశం ఉంది.

మద్దతు ధరకు కొనాలే

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు మక్కలు కొనాలే.  ఎంత జల్ది సెంటర్లు తెరిస్తే అంత మంచిది. నాలుగు పైసలు ఎక్కువ వస్తయ్​
-  వి. శ్రీనివాస్​రెడ్డి, రైతు, సుజాతనగర్​ 

దళారులకు అమ్ముకుంటున్నం..


గవర్నమెంటోళ్లు మక్కలు కొంటమని చెబుతుర్రు కానీ ఇప్పటి దాకా ఒక్క జాగల కూడా కేంద్రాలు తెరవలేదు. ఒకదిక్కు అప్పులు బాధ, మరో దిక్కు వానలు పడి మక్కలు పాడైతయని దళారులకు అమ్ముతున్నం.. వాళ్లు 1600 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. - బాబు, మక్కజొన్న  రైతు, గుండాల 

ఏర్పాటు చేయనున్నాం
జిల్లావ్యాప్తంగా పది చోట్ల మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. మూడు, నాలుగు రోజుల్లోనే కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు మక్కలను ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకురావాలి. - ఎం.సునీత, మార్క్ ఫెడ్ డీఎం