కొత్త గూడెం మున్సిపాలిటీలో ఆగని అక్రమ నిర్మాణాలు

కొత్త గూడెం మున్సిపాలిటీలో ఆగని అక్రమ నిర్మాణాలు
  • పట్టణం నడిబొడ్డున పర్మిషన్లు లేని బిల్డింగ్​లు 
  •  బీఆర్​ఎస్​ భవనానికి ఇంటి ట్యాక్స్​ నుంచి మినహాయింపు!
  •  చూసీచూడనట్లుగా అధికారులు 
  •  చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. పట్టణం నడి బొడ్డున ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అనుమతుల్లేని నిర్మాణాల్లో కొన్నిటిని పరిశీలిస్తే.. 

  •     కొత్తగూడెం పట్టణం మధ్యలో నేషనల్​హైవే పక్కనే పర్మిషన్స్​ లేకుండా భారీ సెల్లార్​ నిర్మాణం కొనసాగుతోంది. పలువురు మున్సిపల్​ కమిషనర్, టౌన్​ ప్లానింగ్​ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా పనులు ఆపకపోవడం గమనార్హం. 
  •     గణేశ్​టెంపుల్​ ప్రాంతంలో ఓ వ్యాపారి ఎటువంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలను పూర్తి చేశారు. 
  •     త్రీటౌన్​ పోలీస్​ స్టేషన్​ దారిలో పూర్తి స్థాయి పర్మిషన్స్​ లేకున్నా బిల్డింగ్ ​కట్టారు. విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. 
  •     మున్సిపాలిటీ ఆఫీస్​ నుంచి సింగరేణి మెయిన్​ హాస్పిటల్​ వెళ్లే దారిలో ఓ బిల్డింగ్​ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్​ రాకముందే దాదాపుగా పనులన్నీ పూర్తి చేశారు. పర్మిషన్​వస్తుందంటూ అధికారులు ఆ బిల్డింగ్​ యజమానికి అండగా నిలబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
  • రైటర్​ బస్తీ, హెడ్డాఫీస్​ సమీపంలో మున్సిపల్​ పర్మిషన్స్​ లేకుండా సింగరేణి యాజమాన్యం భారీ నిర్మాణాలు చేపడుతోంది. 
  • ఎల్ఐసీ ఆఫీస్​ సమీపంలో పర్మిషన్స్​ లేకుండా బీఆర్​ఎస్​ జిల్లా పార్టీ ఆఫీస్​ను నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు. పైగా  ఆ ఆఫీస్​కు మున్సిపల్​ పాలకులు, ఆఫీసర్లు ఇంటి ట్యాక్స్​మినహాయించారు.  ఇటీవల ఇంటి ట్యాక్స్​లపై రివ్యూ నిర్వహించిన క్రమంలో ఈ విషయం బయట పడింది. బిల్డింగ్​నిర్మించి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంటి ట్యాక్స్​ వేయకపోవడం గమనార్హం. ఇంటి ట్యాక్స్​కట్టకపోతే నల్లా కనెక్షన్లను కట్​ చేసే మున్సిపల్​ ఆఫీసర్లు బీఆర్​ఎస్​పార్టీ బిల్డింగ్​కు ఇంటి ట్యాక్స్​ వేయకపోవడంపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అనుమత్లేని నిర్మాణాలపై చర్యలు

నేను ఇటీవలే బదిలీపై ఇక్కడకు వచ్చాను. పట్టణంలో అనుమతుల్లేని బిల్డింగ్​లను గుర్తించి  చర్యలు తీసుకుంటాం. బస్టాండ్​ సెంటర్​లో పర్మిషన్స్ లేని సెల్లార్​పై ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చాం. కానీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ​దృష్టికి తీసుకెళ్తాం. 

- శేషాంజన్​ స్వామి, మున్సిపల్​ కమిషనర్, కొత్తగూడెం