- ఎలాంటి అనుమతుల్లేకున్నా డీపీఆర్ మాటున వర్క్స్
- పంప్‌హౌస్ పనులు 87 శాతం పూర్తి.. అప్రోచ్ చానెల్ పనులూ స్పీడప్
- శ్రీశైలంలో 800 అడుగుల నుంచే 101 టీఎంసీలు తరలించే కుట్ర
- తాగునీటి అవసరాల కోసమంటూ డ్రామాలు
- కేడబ్ల్యూటీ 1 అవార్డు ప్రకారం ఔట్‌సైడ్ బేసిన్‌కు నీళ్ల తరలింపు నిషేధం
- డీపీఆర్‌కు మించి ఏపీ పనులు చేసిందని తేల్చిన జాయింట్ కమిటీ
- ఐదేండ్లలో ఏనాడూ సీరియస్‌గా తీసుకోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం
- నేటికీ దృష్టిపెట్టని కాంగ్రెస్ సర్కార్.. కేంద్రానికి లేఖలతోనే సర
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ నుంచి దొడ్డిదారిలో నీళ్లు మళ్లించుకుపోయేలా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(సంగమేశ్వరం/ఆర్ఎల్ఐఎస్) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టును ప్రారంభించినా.. నాటి బీఆర్ఎస్సర్కార్ కండ్లు మూసుకొని ఉండడం, అడ్డుకునేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. ఒకట్రెండుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా అవి కేవలం పర్యావరణ అనుమతుల అంశం వరకే పరిమితమయ్యాయి. దీంతో ఏపీలో కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ పనులను చకచకా కొనసాగిస్తున్నది.
డెడ్‌స్టోరేజీకి దిగువ నుంచే జలదోపిడీ
ఏపీలోని గత జగన్ సర్కార్ పక్కా ప్రణాళిక ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జలదోపిడీకి తెరతీసింది. డెడ్‌స్టోరేజీకి దిగువన 800 అడుగుల నుంచే రోజుకు 3.5 టీఎంసీలను తరలించుకుపోయేలా సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు, అలాగే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే విస్తరణ పనులకు అనుమతిస్తూ 2020 మే 5న జీవో 203 జారీ చేసింది. సంగమేశ్వరం ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టుకు 29 టీఎంసీలు, చెన్నై వాటర్ సప్లైకి 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌కు 19 టీఎంసీలు, గాలేరు నగరి సుజల స్రవంతికి 38 టీఎంసీల చొప్పున మొత్తం 101 టీఎంసీలను తాగునీటి అవసరాల పేరుతో దొడ్డిదారిలో మళ్లించుకుపోయేందుకు పథకం వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచడం ద్వారా 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయే పనిలో ఏపీ నిమగ్నమైంది. దీనికి సైతం సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) అనుమతులు లేవు. గత కేసీఆర్సర్కార్ నిర్లక్ష్యంతో నాడు జగన్‌సర్కార్ రాయలసీమ లిఫ్ట్స్కీమ్పనులను ప్రారంభించగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్సర్కార్ సైతం దీనిపై దృష్టిపెట్టకపోవడంతో ఏపీలో ఎప్పట్లాగే పనులు కొనసాగుతున్నాయి.
పర్యావరణ అనుమతుల్లేకున్నా..
రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌కు పర్యావరణ అనుమతులు ఇప్పటికీ రాలేదు. అయినా ఏపీ సర్కార్ మాత్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్పీడప్ చేసింది. కేవలం డ్రింకింగ్‌వాటర్ కోసమే ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్తున్నది. అందుకు అనుగుణంగా గతేడాది ఆగస్టు 11న జీవో 364 జారీ చేసింది. ప్రాజెక్టును ఫేజ్1, ఫేజ్2 కింద విభజించామని.. ప్రస్తుతం ఫేజ్1 పనులు డ్రింకింగ్ వాటర్ కోసమే చేస్తున్నామని వాదిస్తున్నది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ముసుగులో ఫేజ్1 పనులను చేస్తున్న ఏపీ.. పనిలోపనిగా ఇరిగేషన్ అవసరాలను తీర్చే ఫేజ్2 పనులనూ మొదలుపెట్టేసింది. ఇప్పటికే ప్రాజెక్టులో భాగమైన పంప్హౌస్నిర్మాణ పనులు 87 శాతం పూర్తి చేసింది. నీటిని తరలించే స్థానం నుంచి పంప్హౌస్వరకు అప్రోచ్చానెల్పనులనూ 14.13 శాతం పూర్తి చేసింది. అప్రోచ్చానెల్లో 4.59 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్పనులను చేయాల్సి ఉండగా, 64.97 లక్షల క్యూబిక్ మీటర్ల పని కంప్లీట్ చేసింది. పంప్‌హౌస్‌కు మొత్తం 27 లక్షల క్యూబిక్‌మీటర్ల పని చేయాల్సి ఉండగా, 23.49 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేసేసింది. మరో 3.50 లక్షల క్యూబిక్‌మీటర్ల పని మాత్రమే పెండింగ్‌లో ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా నీళ్ల తరలింపు..
వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్‌సైడ్ బేసిన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తరలించవద్దని నిబంధనలు చెప్తున్నాయి. 1960 సెప్టెంబర్‌తర్వాత చేపట్టిన ఏ ప్రాజెక్టు నుంచి కూడా బేసిన్ బయటకు నీటిని తరలించొద్దని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్1 (బచావత్ట్రిబ్యునల్) అవార్డు స్పష్టం చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా శ్రీశైలం బేసిన్లోనే లేని రాయలసీమకు నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నది. అంతేగాకుండా పెన్నా బేసిన్లో ఇప్పటికే ఏపీకి 307.6 టీఎంసీల గ్రాస్ స్టోరేజీ అందుబాటులో ఉంది. ఒక ఏడాదిలో వచ్చే వరదలు 75 శాతం ఆధారంగా (75% డిపెండబిలిటీ) చూసుకున్నా 200 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లే అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి ఏపీ డ్రింకింగ్‌వాటర్‌కు తరలించుకుపోవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఏపీ ఉద్దేశపూర్వకంగానే శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్కీమ్ ద్వారా నీటిని మళ్లించుకుపోయేందుకు కుట్ర పన్నుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు డ్రింకింగ్‌వాటర్ కోసమే అయినా రోజుకు 3.5 టీఎంసీల అవసరం ఏముంటుందన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
మూడేండ్లు కండ్లు మూసుకున్న కమిటీ..
రాయలసీమ ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకునేందుకు, నిబంధనల ప్రకారమే ఏపీ ముందుకు వెళ్తుందో? లేదో? తేల్చేందుకు జాయింట్కమిటీ వేయాలన్న బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్(కృష్ణ వాటర్డిస్ప్యూట్స్ట్రిబ్యునల్2) ఆదేశాల మేరకు 2021 డిసెంబర్17న కేంద్ర ప్రభుత్వం జాయింట్‌కమిటీని ఏర్పాటు చేసింది. పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్శాఖ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్‌బాబు పసుపులేటి, హైదరాబాద్ జీఎస్ఐ ఇంజినీరింగ్ జియాలజీ డివిజన్ డైరెక్టర్ శైలేంద్రకుమార్సింగ్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ఎం.రమేశ్‌కుమార్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రాజెక్ట్ సైట్‌ను వీలైనంత త్వరగా పరిశీలించి పర్యావరణ, అటవీ శాఖకు నివేదిక సమర్పించాల్సి ఉంది. సీడబ్ల్యూసీ (సెంట్రల్వాటర్కమిషన్) నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా? డీపీఆర్ఉద్దేశం ఏమిటి? గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతున్నారా? లేదా? లాంటి అంశాలను తేల్చాల్సి ఉంది. కానీ, దాదాపు మూడేండ్ల పాటు ఈ జాయింట్కమిటీ కనీసం స్పందించలేదు. ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పటికే ఏపీ డీపీఆర్మాటున ప్రాజెక్టు పనులను వేగంగా చేసేసింది. తీరా ఈ ఏడాది మార్చి 13, 14న ప్రాజెక్ట్సైట్ను జాయింట్కమిటీ సందర్శించింది. మార్చి 22న పర్యావరణ, అటవీ శాఖకు తన నివేదికను సమర్పించింది. ఏపీ సర్కార్ కనీసం పర్యావరణ అనుమతుల్లేకుండానే, డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)కు మించి పనులను చేసిందని నివేదికలో స్పష్టం చేసింది. పనులతో పర్యావరణానికి నష్టం కలిగిందని, సెంట్రల్పొల్యూషన్కంట్రోల్బోర్డు (సీపీసీబీ) గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పనులు చేయలేదని.. అందుకు రూ.2 కోట్ల 65లక్షల 31వేల 250 మేర పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పర్యావరణానికి జరిగిన డ్యామేజీకిగానూ పలు చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది.
లేఖలు తప్ప చర్యలేవీ?
అప్పట్లో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ‘సారూ.. సంగమేశ్వరం కడ్తున్నరు’ పేరుతో ‘వెలుగు’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. అప్పటికే ఆ ప్రాజెక్టు గురించి తెలిసినా నాటి సీఎం కేసీఆర్మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్రాయలసీమ ప్రాజెక్టుపై కోర్టుకు వెళ్లడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. అప్పుడు కూడా ప్రాజెక్టును అడ్డుకోవడానికి నాటి బీఆర్ఎస్ సర్కార్ కనీస చర్యలు తీసుకోలేదు. పైగా నీళ్ల విషయంలో గొడవలొద్దని, రాయలసీమకూ నీళ్లివ్వాల్సిన అవసరం ఉందని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పటి ఏపీ సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని దావత్‌లు చేసుకున్నారు. అప్పటి మంత్రి రోజా ఇంటికి వెళ్లి విందు భోజనాలు చేసొచ్చారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేందుకు ఆస్కారం ఉందని తెలిసినా, అపెక్స్‌కౌన్సిల్ మీటింగ్‌లకు కేసీఆర్ హాజరుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కనీసం అధికారులను సైతం పంపించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడం, ఆరోపణలు వెల్లువెత్తడంతో నామమాత్రంగా ట్రిబ్యునల్‌కు లేఖలు రాసి, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి, కొన్నాళ్ల తర్వాత పట్టించుకోవడం మానేశారు. ట్రిబ్యునల్ముందు అడపాదడపా ఇరిగేషన్ డిపార్ట్మెంట్వాదనలు వినిపిస్తున్నా.. లేఖలు రాస్తున్నా ప్రయోజనం మాత్రం దక్కలేదు. కాగా, కాంగ్రెస్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ ప్రాజెక్ట్‌పై సీరియస్‌గా దృష్టి సారించలేదు. ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుపై ఒకటిరెండు సార్లు లేఖలు రాశారని చెప్తున్నా.. ఆశించిన ఫలితం దక్కలేదు. రెండు వారాల క్రితం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా కూడా కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. అందులో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని కోరారే తప్ప.. ప్రాజెక్టు పనులను ఆపాలని గట్టిగా చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్పనులు మరింత ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏపీ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీశైలం జలాల్లో భారీ గండి కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు..
జాయింట్కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ సర్కార్ కు ఈ ఏడాది ఏప్రిల్24న కేంద్ర పర్యావరణ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీపీఆర్‌ను తయారు చేసేందుకు పనులు చేస్తామని చెప్పి, అంతకు మించి పనులు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. ఎన్విరాన్మెంట్ప్రొటెక్షన్యాక్ట్1986 కింద ఇచ్చిన ఈ షోకాజ్నోటీసుల్లో డీపీఆర్ తయారు చేసేందుకు చేయాల్సిన పనులకూ ఎన్విరాన్మెంట్క్లియరెన్సులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. కానీ, ప్రాజెక్టు విషయంలో ఏపీ నిబంధనలు ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది. వాస్తవానికి డీపీఆర్ కోసం పనులు చేయాల్సి వస్తే.. ఈఐఏ నోటిఫికేషన్2006 ప్రకారం కేవలం ప్రాజెక్ట్ సైట్చుట్టూ ప్రహరీ నిర్మాణం, ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలికంగా కరెంట్, నీటి సౌకర్యం కల్పించడం వంటి పనులను మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఏపీ మాత్రం వాటికి మించి పంప్‌హౌస్‌ల కోసం ఎక్స్కవేషన్వర్క్స్, టన్నెల్వర్క్స్, అప్రోచ్కెనాల్వర్క్స్ను కూడా చకచకా చేసేస్తున్నది.
ప్రాజెక్టు జీవో ఇచ్చిన అధికారినే తెలంగాణలో తెచ్చిపెట్టుకున్నరు..
రాయలసీమ ప్రాజెక్టుని చేపడుతున్నామని పేర్కొంటూ 2020లో నాటి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయనపైనే పలు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. పనులు ఆపాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా వినకుండా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో తెలంగాణ అధికారులు గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి వెళ్లగా, ఆదిత్యనాథ్ దాస్ పై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పుడు అదే అధికారిని కాంగ్రెస్ సర్కార్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సలహాదారుగా నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాడు ఏపీ సర్కార్ కోసం నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన వ్యక్తి.. మన రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.