రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూపులు

  •     గిరిజన గురుకులాల్లోని 316 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ కు గత సర్కార్ మొండి చేయి
  •     కొత్త సర్కారైనా తమకు న్యాయం చేయాలని వేడుకోలు 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ ను రెగ్యులరైజ్ చేసి, తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్​ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో కుక్స్, కిచెన్ హెల్పర్లు, వర్కర్లు, అటెండర్లు, ఏఎన్ఎంలు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా మొత్తం 316 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా రెగ్యులరైజేషన్​కోసం ఎదురుచూస్తున్నారు.

20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే.. 

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని గురుకులాల్లో 15, 20 ఏళ్లుగా 441 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొత్త జిల్లాలవారీగా రెగ్యులరైజేషన్ కు అర్హత కలిగిన నాన్ టీచింగ్ స్టాఫ్ 316 మంది ఉన్నారు. వీరిలో జూనియర్ అసిస్టెంట్లు 21 మంది, ఏఎన్ఎంలు 20 మంది, కుక్స్ 30 మంది, ఆయాలు నలుగురు, ఆఫీస్ సబార్డినేట్స్ 46 మంది, కిచెన్ హెల్పర్లు 58 మంది, మల్టీ పర్పస్ వర్కర్లు133 మంది, సొసైటీ హెడ్ ఆఫీసులో నలుగురు పనిచేస్తున్నారు. వీరితోపాటే రిక్రూట్ అయిన టీచింగ్ స్టాఫ్ 401 మంది సీఆర్టీలను 2008 ఆగస్టులోనే రెగ్యులరైజ్ చేశారు. 2011లో నాన్​టీచింగ్​స్టాఫ్​సర్వీస్ రెగ్యులరైజేషన్ కు ప్రతిపాదనలు పంపినప్పటికీ.. ప్రభుత్వం పక్కనపెట్టింది.  

హామీ ఇచ్చి మరిచిన కేసీఆర్

కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోల్లో పెట్టింది. 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 2022లో గత సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను రెగ్యులరైజ్ చేసినప్పటికీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని నాన్ టీచింగ్ స్టాఫ్ ను పక్కన పెట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను రెగ్యులరైజ్ చేయాలని నాన్ టీచింగ్ స్టాఫ్ కోరుతున్నారు.