మోత్కూరులో నాన్ వెజ్ ఉగాది!

మోత్కూరు, వెలుగు: ఉగాది అనగానే ఉగాది పచ్చడి, బక్ష్యాలు గుర్తొస్తాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో మాత్రం జనాలు ఇందుకు భిన్నంగా జరుపుకున్నారు. ముత్యాలమ్మకు యాటలు, కోళ్లు కోశారు. అమ్మవార్లకు శాకలు పోశారు. ఉగాది పచ్చడితో పాటు మటన్, చికెన్, మందుతో విందు చేసుకున్నారు. తూర్పున చెరువు కట్ట ముత్యాలమ్మ, పడమర అంగడి బజార్​లోని ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. 

రైతులు ఎడ్ల బండ్లను, వాహనదారులు వెహికల్స్​ను ఆలయాల చుట్టూ, హైస్కూల్ లో హోళింగా..హోళింగా అంటూ ప్రదర్శనగా తిప్పారు. యూత్ బైకులతో హంగామా చేశారు.  వందేండ్ల కింద మోత్కూరులో పెద్ద సంఖ్యలో ప్రజలకు అమ్మవారు (మూశూచి) సోకి చనిపోతుండటంతో ఉగాది రోజున ముత్యాలమ్మలకు చలి బోనాలు చేసి, జంతుబలి ఇవ్వడంతో తగ్గిపోయిందని చెప్పుకుంటారు. ఇక అప్పటి నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.