మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేయని డిస్ ప్లేలు.. బోర్డులపై విమానాల వివరాలు

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేయని డిస్ ప్లేలు.. బోర్డులపై విమానాల వివరాలు

 మైక్రోసాఫ్ట్  ఎఫెక్ట్ శంషాబాద్ ఎయిర్ పోర్టుపై పడింది.  మైక్రోసాఫ్ట్ అజూర్ లో ఏర్పడ్డ సాంకేతిక లోపంతో  శంషాబాద్ లో  ఎయిర్  పోర్టులో పలు విమానాలను రద్దు చేశారు.  ఇప్పటివరకు 35 విమానాలు రద్దు చేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. అంతేగాకుండా  ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు కూడా పనిచేయడం లేదు. మాన్యువల్ బోర్డు ఏర్పాటు చేశారు  అధికారులు. దీంతో ఏయే విమానాలు రద్దు అయ్యాయో వాటి వివరాలను  బోర్డులపై రాస్తున్నారు. 

ఇప్పటికే బోర్డింగ్ పాసులను కూడా చేతితో రాసి ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్ కావటంతో.. బోర్డింగ్ పాసులపై ఈ ప్రభావం పడిందని.. ఫ్లయిట్స్ లేటు అవ్వకుండా.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు వెల్లడించింది ఎయిర్ పోర్ట్.

ప్రయాణికులు తమ విమానాలకు సంబంధించిన సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని తెలిపింది.ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన క్రమంలో.. ప్రయాణికులు వీలైనంత త్వరగా ఏయిర్ పోర్ట్ కు చేరుకుని చెక్ ఇన్ చేసుకోవాలని  సూచించింది.

ALSO READ | మైక్రోసాఫ్ట్ డౌన్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బోర్డింగ్ పాసులను ఇలా చేతితో రాసి ఇస్తున్నారు..!

మరోవైపు ఇండిగో, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి  పలు విమానయాన సంస్థలు ఈ అంతరాయంపై స్పందించాయి. తమ ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశాయి. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా నెట్‌వర్క్ అంతటా తమ సేవలు ప్రభావితమయ్యాయని.. దీని ఫలితంగా ఆన్ లైన్ బుకింగ్, చెక్ ఇన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొన్నాయి.

అంతరాయానికి చింతిస్తున్నామని..  పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొన్నాయి. ప్రయాణికులు చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా ఎయిర్ పోర్టుకు చేరుకుని  చెక్ ఇన్ చేసుకోవాలని అభ్యర్థించాయి. లేని యెడల భారీగా క్యూలైన్లు ఏర్పడి ప్రయాణానికి ఆటంకంగా మారవచ్చని పేర్కొన్నాయి.