ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. భారీ ధరకు పలుకుతారని అంచనాలున్నా ప్లేయర్లు తక్కువ ధరకు అమ్ముడవుతుండగా.. ఏ మాత్రం అంచనాలు లేని ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడవుతున్నారు. ఆఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా కనీస ధర కోటి రూపాయలతో వేలంలోకి వచ్చిన ఆఫ్ఘాన్ స్పిన్నర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు.
ప్లేయర్ల విషయంలో అచితూచీ వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ నూర్ అహ్మద్‌ను ఏకంగా రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. నూర్ అహ్మద్ వేలంలోకి రావడమే ఆలస్యం అతడికి కోసం చెన్నై, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ఘాన్ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్లో నూర్ అహ్మద్ గుజరాత్ టైటాన్స్ తరుఫున ఆడాడు. వచ్చే సీజన్ కోసం గుజరాత్ అతడిని రిటైన్ చేసుకోలేదు.
దీంతో మెగా వేలంలోకి వచ్చిన నూర్ అహ్మద్‌ను ఊహించని ధరకు చెన్నై దక్కించుకుంది. గుజరాత్ వదిలేసిన 19 ఏళ్ల నూర్ అహ్మద్ కోసం చెన్నై ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ మెగా వేలంలో చెన్నై ఇప్పటి వరకు అశ్విన్, రచీన్ రవీంద్ర, కాన్వే, నూర్ అహ్మద్‌లను కొనుగోలు చేసింది. ధోని, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరణ, శివమ్ దూబేను వచ్చే సీజన్ కోసం చెన్నై రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.