భద్రాచలం, వెలుగు ఆదివాసీలకు పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవాలు కావడంలేదు. దీంతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతనే కారణం. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఆదివాసీలు ప్రధానంగా ఇక్కడికే ప్రసవాల కోసం వస్తుంటారు. అయితే ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడంలేదు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని 200 పడకలతో ప్రస్తుతం కొనసాగుతోంది. అందుకు తగ్గ సౌకర్యాలు మాత్రం లేవు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు కావాలని భావించినా అది నెరవేరడం లేదు.
ఇక్కడికి ప్రధానంగా ఆదివాసీ కుటుంబాలే ఎక్కువగా వైద్యం కోసం వస్తుంటారు. ఇక్కడి ఆస్పత్రిలో ప్రసవం చేసే డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు గైనకాలజిస్టు పోస్టులు ఉండాలి. కానీ వీటిని ఏళ్ల తరబడి భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్ట్ డాక్టర్లను తీసుకుంటే రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. గతేడాది ఇక్కడ ముగ్గురిని నియమిస్తే ఇద్దరు కొలువును వదిలేసి వెళ్లిపోయారు.
మరొకరు లాంగ్‌లీవు పెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పురిటి నొప్పులతో వస్తే కొత్తగూడెం, ఖమ్మం పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. రోగులు దూరభారం భరించలేక స్థానిక ప్రైవేట్ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిరుపేద గిరిజనులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల కొరత ఎప్పుడు తీర్చుతారో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లలో భారీగా తగ్గిన ప్రసవాలు..
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రభుత్వం కేటాయించిన పోస్టుల ప్రకారం ఐదుగురు గైనకాలజిస్టులు, నలుగురు హెడ్‌నర్సులు,19 మంది స్టాఫ్ నర్సులు, ఒక మిడ్వైఫ్ఉండాలి. అయితే ఇవి ఇప్పటికీ భర్తీ కాలేదు. గైనకాలజిస్టులను కాంట్రాక్ట్పద్ధతిలో నియమించి కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. వారు సైతం మధ్యలోనే రిజైన్‌చేసి వెళ్లిపోతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైంది. ముగ్గురిని కాంట్రాక్ట్విధానంలో నియమించారు. కానీ వారిలో ఇద్దరు రిజైన్చేయగా, మరొకరు లాంగ్లీవ్పెట్టి మూడు రోజుల క్రితం తిరిగి జాయిన్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2021–-22 సంవత్సతరంలో 2198 సాధారణ,1761 సిజేరియన్కాన్పులు చేశారు. 2022–-23 సంవత్సరానికి మాత్రం 962 సాధారణ,1267 సిజేరియన్కాన్పులు చేశారు. అంటే1730 కాన్పులు తగ్గాయి. ఏరియా ఆస్పత్రిలోని పరిస్థితులకు ఈ గణాంకాలే నిదర్శనం. ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యంత మెరుగైన సౌకర్యాలు ఉండి, ప్రసవాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన పెద్దాస్పత్రి ఇప్పుడు సర్కారు నిర్లక్ష్యంతో దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
పేరు గొప్ప..ఊరు దిబ్బ...
సర్కార్ఆస్పత్రి తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవానికి రమ్మంటారు. వస్తే డాక్టర్లు ఉండరు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్టులు లేరు. గిరిజనులంటే సర్కారుకు అంత అలుసా..? సౌలత్లు లేక ప్రైవేట్ఆస్పత్రులకు పోతున్నారు. అక్కడ దండిగా డబ్బులు గుంజుతున్నరు. తక్షణమే వైద్యులను నియమించాలి.
–చెరుకూరి సతీశ్‌కుమార్,
బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఎమర్జెన్సీ అయితే చేయలేకపోతున్నాం...
లీవులో వెళ్లిన గైనకాలజిస్టు ఒకరు వచ్చారు. ఆమె కూడా ట్రైనింగ్‌కు వచ్చినవారే. పూర్తిస్థాయిలో కాదు. అందుకే ఆస్పత్రిలో ఎమర్జెన్సీ డెలివరీ కేసులు తీసుకోకుండా ఇతర పట్టణాలకు రిఫర్చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి పై ఆఫీసర్లకు వివరించాం. ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే.
–డాక్టర్రామకృష్ణ,
సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి