- కొత్తగూడెంలో రూ.కోట్ల పనులపై పర్యవేక్షణ కరువు
- ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీ
- క్వాలిటీ గాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉండడం కాంట్రాక్టర్లకు కలిసి వస్తోంది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇష్టారీతిన పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పాటించడం లేదు. పర్యవేక్షించాల్సి అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం టౌన్లో రూ. 5కోట్లకు పైగా సీసీ రోడ్లు, డ్రైనేజీలతోపాటు మార్కెట్ పనులు సాగుతున్నాయి. స్థానిక ఎంజీ రోడ్‌సమీపంలో దాదాపు రూ.కోటితో మార్కెట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి.
కాంట్రాక్టర్ఇష్టారీతిన పనులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గోదావరి ఇసుక వాడాల్సి ఉండగా, మొదట్లో సమీపంలోని వాగుల్లోని ఇసుక వాడారు. పలువురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత మేర గోదావరి ఇసుకను ఉపయోగించారు. నిబంధనలకు విరుద్దంగా సమీపంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్ నుంచి డైరెక్ట్‌గా నల్లా కనెక్షన్ తీసుకొని వినియోగిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక, సిమెంట్, వాటర్మిక్సింగ్లోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలైన్, మార్కెట్ ఏరియా, బూడిదగడ్డ, పెద్దబజార్, ఓల్డ్ డిపో నుంచి పాత కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటించడం లేదు. వైబ్రేటర్‌ను కేవలం ఆఫీసర్లు వచ్చినప్పుడే వాడుతూ మిగిలిన టైంలో కర్రలనే వైబ్రేటర్లుగా వినియోగిస్తున్నారు. గత నెలలో వానల టైంలోనూ కాంట్రాక్టర్లు సీసీ నిర్మాణాలు చేపట్టారు. ఎంజీ రోడ్డు నుంచి లేపాక్షి హోటల్‌వైపు డ్రైనేజీ నిర్మాణం అడ్డదిడ్డంగా చేపట్టారు.
షాపుల ముందు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేయడం అధికారుల పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీకి మెట్లు అడ్డం వస్తున్నాయని చెప్పా పెట్టాకుండా కూల్చివేసిన ఆఫీసర్లు, కొన్ని షాపుల ముందు తిరిగి డ్రైనేజీలు నిర్మించలేదని వాపోతున్నారు. సూర్యా ప్యాలెస్‌నుంచి ఎస్పీ ఆఫీస్, ఓల్డ్డిపో నుంచి పాత కొత్తగూడెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన డ్రైనేజీల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు అభివృద్ధి పనుల్లో క్వాలిటీకి పెద్ద పీట వేస్తున్నామని మున్సిపల్కమిషనర్రఘు, డీఈ రవికుమార్ పేర్కొంటున్నారు. మార్కెట్నిర్మాణానికి ఓవర్‌హెడ్‌ట్యాంక్ నుంచి నల్లా నీటిని వాడొద్దని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు గోదావరి ఇసుకనే వాడాల్సి ఉందన్నారు.