డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసిన సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రంలోనూ జనానికి దడ పుట్టిస్తున్నారు. ఆన్‌లైన్ ఇంటరాగేషన్, డిజిటల్ అరెస్ట్ అని బాధితులను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రాష్ట్రంలో గత 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితులను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించిన అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన కేటుగాళ్లు రూ. 237 కోట్ల వరకూ లూటీ చేశారు.
సౌత్‌ను టార్గెట్ చేసిన నార్త్ నేరగాళ్లు
ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్‌గావ్, యూపీ, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. నార్త్ ఇండియాతో పోల్చితే సౌత్‌లో హిందీ మాట్లాడే వారి సంఖ్య తక్కువ.
హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల వారికి హిందీ సరిగా అర్థం కాకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించరనే ధీమాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చైన్ సిస్టమ్ ఏజెంట్ల నెట్‌వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కామర్స్, డార్క్‌వెబ్ సహా ఇతర ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఫోన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇతర సైబర్ నేరాల్లో నైపుణ్యం పొందిన నేరగాళ్లే ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు తెరతీశారు.
పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్స్..
సైబర్ నేరగాళ్లు సేకరించిన ఫోన్ నంబర్స్‌కు మొదట ఎస్‌ఎమ్‌ఎస్ లేదా మెయిల్, వాట్సాప్ ద్వార సమాచారం అందిస్తారు. మనీలాండరింగ్, పోర్న్, డ్రగ్స్ సహా ఇతర నేరాలు చేస్తున్నారని గుర్తించినట్టు తెలుపుతారు. ఆ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్‌పై 20కి పైగా కేసులు రిజిస్టర్ అయినట్లు చెప్తారు. అత్యవసరంగా కాల్ చేయాలని ఫోన్ నంబర్ అందిస్తారు. స్పందించని వారికి మళ్ళీ మళ్ళీ మెసేజ్‌లు పంపిస్తుంటారు.
అరెస్ట్ వారెంట్‌జారీ అయ్యిందని ఫేక్ ఫొటోలు పంపిస్తారు. ఆ తరువాత సైబర్ నేరగాళ్లే కాల్ చేస్తారు. ఢిల్లీ, ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్తారు. అరెస్ట్ చేసేందుకు వస్తున్నట్లు భయపెడతారు. బాధితుల మానసిక పరిస్థితిని గమనిస్తారు. వారు భయపడుతున్నట్లు గుర్తించిన తరువాత మరో ప్లాన్ అమలు చేస్తారు.