జహంగీర్ పురి కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. యథాతథాస్థితిని పాటించాలని ఆదేశించింది. కూల్చివేతలపై అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది జమైత్ ఉలామా ఇ హింద్ సంస్థ. కనీసం నోటీసులు ఇవ్వలేదని, జవాబిచ్చేందుకు 10 రోజలు వ్యవధి కూడా ఇవ్వలేదని వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాది దవే. రేపు తదుపరి విచారణ చేపడతామని... వెంటనే స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ జహంగీర్‌పురి వద్ద ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది.
జహంగిర్ పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఫాలో అవుతామన్నారు నార్త ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్. మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతలను ఆపుతామన్నారు. గత వారం హింసాత్మక ఘటనలు జరిగిన ఢిల్లీలోని జహంగీర్ పురిలో బుల్ డోజర్లతో మోహరించారు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తున్నారు. రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగా తెలిపారు అధికారులు.
జహంగీర్ పురిలో ఈనెల 16న హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో.. మరుసటి రోజు నుంచే ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు కూల్చివేతలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.
#WATCH | Anti-encroachment drive still underway at Jahangirpuri by North Delhi Municipal Corporation despite Supreme Court order to maintain status-quo pic.twitter.com/cAG4FhdpMT
— ANI (@ANI) April 20, 2022