ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు..

ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు..

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో  రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు చలి మరోవైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గడ్డ కట్టేంత ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. కాన్పూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయాయి.  

https://twitter.com/ANINewsUP/status/1612290531698282498

చలికి తట్టుకోలేక  కాన్పూర్‌లో  వారం రోజుల్లో ఏకంగా 98 మంది మృతి చెందారు.  గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలిలో ఒక్కసారిగా రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున 60ఏళ్లు పైబడిన వారు బయటికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. మరోవైపు చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. 


ఢిల్లీలో రోజు రోజుకూ  ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.  ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్‌ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు వల్ల పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వెలుతురు లేమి కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. 

ఉత్తరభారతంలో చలితో పాటు పొగమంచు కూడా పెరుగుతుండటంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు రాజస్థాన్, బీహార్‌లకు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ ప్రకటించింది. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ ప్రభుత్వం..జనవరి 15 వరకు పాఠశాలలను మూసి వేయాలని విద్యాశాఖను ఆదేశించింది.  ఢిల్లీలో ఇప్పటికే  ప్రైవేట్ స్కూళ్లు శీతాకాల సెలవులు ఇచ్చారు.