ప్యాంగాంగ్: ఉత్తర కొరియా సరిహద్దు నుంచి రాజధాని ప్యాంగాంగ్‌లోకి పొరుగు దేశమైన దక్షిణ కొరియా డ్రోన్‌లను పంపిస్తోందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ అన్నారు. అందుకు తగిన విధంగా బదులిచ్చేందుకు దక్షిణ కొరియా సరిహద్దులో కాల్పులకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
సమాచారం ప్రకారం కిమ్ పాలనను వ్యతిరేకిస్తూ దక్షిణ కొరియా ఈనెలలో మూడుసార్లు ప్యాంగాంగ్ లోకి డ్రోన్లను పంపిందని తెలిపింది. ఈ వార్తలపై దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అధికారి స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. ఉత్తర కొరియా చర్యలకు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే సరిహద్దులో డ్రోన్లను పంపారా లేదా అనే వ్యవహారంపై మాత్రం స్పందించలేదు.