సూసైడ్ డ్రోన్లను పరీక్షించిన కిమ్

సూసైడ్  డ్రోన్లను పరీక్షించిన కిమ్

సియోల్: నార్త్ కొరియా తాజాగా సూసైడ్  డ్రోన్లను ప్రయోగించింది. అధ్యక్షుడు కిమ్  జోంగ్ ఉన్ దగ్గరుండి ఈ డ్రోన్ల పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అలాంటి సూసైడ్  డ్రోన్లను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. శత్రు దేశాలతో ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో తమ దేశ మిలిటరీ యుద్ధ సన్నద్ధతను ఎదుర్కొనేందుకు అలాంటి డ్రోన్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. 

అమెరికా, దక్షిణ కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తమ దేశ మిలిటరీ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నామని కిమ్ చెప్పారు. కాగా.. శనివారం సూసైడ్ డ్రోన్లను పరీక్షించారని నార్త్ కొరియా అధికార మీడియా తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన కే2 మెయిన్ యుద్ధ ట్యాంకును పోలి ఉన్నట్లు ఉన్న టార్గెట్​ను సూసైడ్  డ్రోన్లు ఛేదించాయని పేర్కొంది. అమెరికా, సౌత్ కొరియా దేశాల మిలిటరీలు తమ దేశంచుట్టూ యుద్ధ నౌకలన మోహరించి డ్రిల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ డ్రోన్లను పరీక్షించామని వెల్లడించింది.