- యుద్ధ విరమణ వార్షికోత్సవంలో ఉత్తరకొరియా వ్యాఖ్యలు
సియోల్: యుద్ధం వస్తే అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలతో శత్రువులను సమూలంగా నాశనం చేస్తామని ఉత్తర కొరియా సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల కొరియన్ 71వ యుద్ధ విరమణ వార్షికోత్సవం జరిగింది. కిమ్ జోంగ్ ఉన్ హాజరైన ఈ కార్యక్రమంలో సైనిక ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేశారని ఉత్తరకొరియా అధికారిక మీడియా తెలిపింది. న్యూక్లియర్ వార్ కు తమను అమెరికా, దక్షిణ కొరియా రెచ్చగొడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కిమ్ ఆదేశాలతో శత్రువును నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తరకొరియా సైనికాధికారులు ప్రతిజ్ఞ చేశారు. దక్షిణ కొరియాతో మూడేళ్ల యుద్ధానికి విరామమిస్తూ.. అమెరికా, చైనాలతో జులై 27, 1953న ఉత్తరకొరియా ఓ తాత్కాలిక సంధి చేసుకుంది. ఆ రోజును ఉత్తర కొరియా విక్టరీ డేగా సెలబ్రేట్ చేసుకుంటుండగా.. దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.