వరదల టైమ్‌లో నిర్లక్ష్యం..30 మంది ఆఫీసర్లకు ఉరి

వరదల టైమ్‌లో నిర్లక్ష్యం..30 మంది ఆఫీసర్లకు ఉరి

సియోల్ : వరదలు, కొండచరియలు విరిగిపడిన టైంలో సరిగా పనిచేయలేదని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ 30 మంది ప్రభుత్వ అధికారులను ఉరి తీయించారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వరదలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని దక్షిణ కొరియాకు చెందిన చోసన్ టీవీ రిపోర్టులో వెల్లడించింది.

స్వయంగా పర్యటించి ఆరా తీసిండు

గత జులైలో తీవ్ర వర్షాల కారణంగా ఉత్తరకొరియాలో వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు సమయంలో దేశవ్యాప్తంగా 1,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4 వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో కిమ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 

నడుము లోతు నీళ్లలో కారులో వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. సిబ్బంది సహాయక చర్యలపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, ఇంతమంది ప్రాణాలు పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే అభియోగాలు మోపి 30 మందికి కిమ్ ఉరిశిక్ష విధించారని చోసన్ టీవీ తెలిపింది. ఆగస్ట్ నెలాఖరున ఒకే సమయంలో వారందరినీ ఉరితీశారని చెప్పింది. అయితే, ఆ ఆఫీసర్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు.