భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది. వడగాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో బుధవారం(మే 29) 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీలు, నజఫ్‌గఢ్‌లో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది 9 డిగ్రీలు అధికం. ప్రజలు బయటకు వస్తే అగ్నిగుండంలోకి అడుగుపెట్టినట్లే ఉంటోంది. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయేమోనన్న భయంతో విద్యుత్‌శాఖ అధికారులు వాటికి ఎయిర్‌కూలర్లు ఏర్పాటు చేశారంటే వేడి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశరాజధానిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ నేరుగా పడే బహిరంగ ప్రదేశాల్లో రేడియేషన్ శాతం అధికంగా ఉంటుందని, అలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు ఉన్నా వడదెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ తెలిపారు.
పశ్చిమదిశ నుంచి గాలులు వీస్తే ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ వైపు నుంచి వీచే వేడిగాలుల కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతాలు ముందుగా వేడెక్కుతాయని ఐఎండీ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కారణంగానే ముంగేశ్‌పూర్, నరేలా, నజఫ్ గఢ్ ప్రాంతాలు వేడిగాలుల ప్రభావంతో భగభగ మండుతున్నాయని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్, హరియాణా,రాజస్థాన్, పంజాబ్‌లోనూ ఎండలు ఇలాగే మండుతున్నాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీలు ఎక్కువ. హరియాణాలోని సిర్సాలో 50.3డిగ్రీలు, పంజాబ్‌లోని భటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 49, ప్రయాగ్‌రాజ్‌లో 48.2, వారణాసి, కాన్పూర్‌లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోనూ పలుచోట్ల 48 డిగ్రీలకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణం కంటే ఎనిమిది డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముంగేష్పూర్ ప్రాంతంలో నిన్న అత్యధికంగా 49.9 డిగ్రీలు నమోదవ్వగా.. ఆ తర్వాత అత్యధికంగా నజఫ్‌గఢ్ ప్రాంతంలో 49.8 డిగ్రీలు రికార్డు అయ్యాయి.
Also read :రైతుల డిమాండ్ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలె : వివేక్ వెంకటస్వామి
సుమారుగా ఇంకో పదిరోజుల వరకూ ఢిల్లీలో ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ సహా ఉత్తరభారతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.