వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి : నార్త్​జోన్​ డీసీపీ రష్మి పెరుమాళ్

సికింద్రాబాద్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. మహంకాళి డివిజన్ పరిధిలోని బంగారం, వస్త్ర వ్యాపారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. వ్యాపార సముదాయాల వద్ద శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  షాపు లోపల, ముందు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ముందస్తు చర్యలతో అశాంతికి తావు లేకుండా ఉంటుందన్నారు. 

సైబర్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల వ్యాపారులు తమకు ఎదురవుతున్న సమస్యలను డీసీపీ దృష్టికి తీసుకురాగా, ఆమె సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, ఏసీపీ సర్దార్ సింగ్, సీఐ నర్సింగరావు, రాఘవేందర్, పరుశురామ్ పాల్గొన్నారు.