ఫేక్​ ఓటర్, ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

ఫేక్​ ఓటర్, ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్
  • ఆరుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • సికింద్రాబాద్ లో ఆన్ లైన్ సెంటర్ ముసుగులో దందా
  • వేలాది పాన్ కార్డు, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్లు తయారీ
  • నిందితుల్లో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏజెంట్ 
  • వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర

బషీర్ బాగ్, వెలుగు : నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్, పాస్ పోర్ట్, పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నిర్వాహకుడు ఎలగం రాజ్ కుమార్ తో పాటు అతనికి సహకరించిన విజయలక్ష్మి, పల్లవి, బండి శంకర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మహబూబ్, గిరిరాజ్ అనిల్ కుమార్ లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, 2 ప్రింటర్లు , బయో మెట్రిక్ మిషన్, కస్టమర్స్ డేటా ఎంట్రీ బుక్ ను సీజ్ చేశారు.

ఈ కేసు వివరాలను హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్ కు చెందిన ఎలగం రాజ్ కుమార్ (42) తొమ్మిందేడ్లుగా సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ లో ఆర్ఎస్ ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో తన షాపులోనే నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెర తీశాడు. మ్యాజికల్ యూనివర్సల్ ఐడీ పోర్టల్ టూల్ అనే యాప్ ద్వారా నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేశాడు.

వాటి ద్వారా ఆధార్ కార్డులకు అప్లై చేశాడు. సర్వశిక్షా అభియాన్ లో ఫీల్డ్ ఏజెంట్ గా పని చేసున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహబూబ్ కు డబ్బు ఆశ చూపి తన ఆధార్ కార్డులను అప్రూవల్ చేయించాడు. ఆ ఆధార్ కార్డులతో పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ లకు అప్లై చేశాడు. వాటి అప్రూవల్ కోసం అతనికి పాస్ పోస్ట్ ఏజెంట్ బండి శంకర్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గిరిరాజ్ అనిల్ కుమార్ లు సహకరిస్తున్నారు. తన షాప్ లోనే ఇద్దరు మహిళలు రచమల్లు విజయలక్ష్మి, కూరపటి పల్లవిని నియమించి వారితో  సర్టిఫికెట్లపై గెజిటెడ్ ఉద్యోగుల సంతకాలు చేయించేవాడు. వీరంతా ముఠాగా ఏర్పడి ఏడాది కాలంలోనే వేలాది నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్డీ రోడ్ లోని ఆర్ఎస్ ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ పై దాడులు చేశామన్నారు.  

గత ఏడాది అరెస్ట్

ముఠా నిర్వాహకుడు ఎలగం రాజ్ కుమార్ గత ఏడాది జూన్ 10న నకిలీ సర్టిఫికెట్లు కేసులో అరెస్ట్ అయినట్లు డీసీపీ తెలిపారు. ఆ సమయంలో  డేటాను క్రాష్ చేయడం వల్ల నకిలీ సర్టిఫికెట్ల వివరాలు లభ్యం కాలేదన్నారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా అతను మళ్లీ దందాను కొనసాగించాడన్నారు. మిగతా ఐదుగురితో కలిసి పెద్దసంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లను చేయించాడని తెలిపారు. ఏడాదిగా 50 వేల ఓటర్ కార్డులు అతని సెంటర్ నుంచి అప్రూవ్ అవ్వగా ..

అందులో నకిలీవే 15 వేలని గుర్తించారు. 10 వేల నకిలీ ఆధార్ కార్డులు, 50 ఫేక్ పాస్ పోర్ట్ లు, 1500 ఫేక్ పాన్ కార్డులు, వందలాది ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేశారని చెప్పారు. వీటిని నిందితులు తమకు ఇష్టమొచ్చినవారికి అమ్మేశారని పోలీసులు తెలిపారు. నకిలీ పాస్ పోర్ట్ లు ఎక్కువగా నేపాలీలకు అమ్ముకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.