సికింద్రాబాద్, వెలుగు: వేర్వేరు రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను కొట్టేసి వాటిని మరో చోట అమ్ముతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ ఆఫీసులో ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడించారు. కోల్‌కత్తాకు చెందిన బొప్పా ఘోష్ ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను దొంగతనం చేసేవాడు. వాటి నంబర్ ప్లేట్, ఇంజిన్, చాసిస్ నంబర్లను తొలగించేవాడు. ఆ కార్లకు మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌కు చెందిన పాత వెహికల్స్ నంబర్ ప్లేట్లను అమర్చేవాడు. ఆర్సీలు తయారు చేయించేవాడు. ఇతర రాష్ట్రాల్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మే డీలర్లను సంప్రదించి ఆ కార్లను వారికి తక్కువ రేటుకు అమ్మేవాడు.
ముషీరాబాద్‌కు చెందిన షానవాజ్ అలీఖాన్(30) కారు డ్రైవర్‌గా, అతడి ఫ్రెండ్ అబ్దుల్ రహీం ఖాన్(43) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కోల్ కతాలో బొప్పాఘోష్ దందా గురించి తెలుసుకున్న రహీం ఖాన్ తాను కూడా ఇలాంటి కార్లను కొని హైదరాబాద్‌లో అమ్ముతానని షానవాజ్‌కు చెప్పాడు. తర్వాత షానవాజ్‌కు తెలిసిన వ్యక్తి అయిన ఖలీంను కలిశారు. అతడి ద్వారా వారాసిగూడకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ జావిద్(49)ను కలిసి బొప్పాఘోష్ను సంప్రదించారు. బొప్పాఘోష్ కొట్టేసిన ఖరీదైన కార్లను షానవాజ్, రహీం కొనుగోలు చేసి వాటిని సిటీలో సెకండ్ సేల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే మిర్యాలగూడకు చెందిన కొడిమళ్ల పరిపూర్ణాచారి అలియాస్ పప్పీ(36), తుర్కయంజాల్ కు చెందిన సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారి వరికుప్పల దశరథ్(35) సైతం బొప్పా ఘోష్ నుంచి కార్లను కొని సిటీలో అమ్ముతున్నారు.
దమ్మాయిగూడకు చెందిన ఠాకూర్ శైలేందర్ సింగ్(55) లక్డీకపూర్ లోని ఓ హోటల్లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. అతడికి సైతం బొప్పా ఘోష్ తో పరిచయం ఏర్పడి ఈ దందాలో చేరాడు. రహీం ఖాన్ ఖరీదైన కార్లకు ఫేక్ నంబర్ ప్లేట్లు పెట్టి సిటీలో తక్కువ రేటుకు అమ్ముతున్నాడంటూ ఓ వ్యక్తి ఈ నెల 17న చిలకలగూడ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన చిలకలగూడ పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి నిఘా పెట్టారు. రహీం ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఈ దందాలో ఉన్న మరో నలుగురు షాన్ వాజ్, శైలేందర్ సింగ్, జావిద్, వరికుప్పల దశరథ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 బ్రిజా కార్లు, మూడు బాలెనో, 3 ఇన్నోవా, 2 స్విఫ్ట్ డిజైర్, 2 స్విఫ్ట్, ఒక క్రెటా, ఒక ఫార్చునార్ మొత్తం 18 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీల్ దత్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 2 కోట్ల 45 లక్షలు ఉండొచ్చని ఆయన చెప్పారు. ప్రధాన నిందితుడు బొప్పా ఘోష్ తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. తక్కువ ధరకు ఖరీదైన కార్లు వస్తున్నాయంటే నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి కార్లను అమ్మివారితో పాటు కొన్న వారు కూడా నిందితులు అవుతారని డీసీపీ హెచ్చరించారు.