- ఎయిర్ పోర్ట్‌లో జీరో విజిబిలిటీ
- 10.2 డిగ్రీల కనిష్ట టెంపరేచర్
- విమాన, రైలు సేవలకు అంతరాయం
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 170 ఫైట్లు ఆలస్యం.. 38 రద్దు
- ప్రయాణికులకు అడ్వైజరీ జారీచేసిన ఎయిర్‌లైన్స్ సంస్థలు
న్యూ ఢిల్లీ: ఉత్తరాదిని చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. శనివారం రెండోరోజు పొగమంచు వీడలేదు. దీంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు శ్రీనగర్, చండీగఢ్, ఆగ్రా, లక్నో, అమృత్‌సర్, హిండన్, గ్వాలియర్ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ లెవెల్ జీరోకు పడిపోయింది. దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 170 ఫ్లైట్స్ డిలే అయ్యాయి. మరో 38 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నదని, అప్డేట్స్కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే, ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఢిల్లీకి వచ్చే 50కి పైగా రైళ్లు ఆలస్యంగానే నడిచాయి.
న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యం కాగా.. వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 14 గంటలు లేట్‌గా నడిచింది. కాగా, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11.15 గంటల తర్వాత విజిబిలిటీ మెరుగుపడడంతో విమాన సర్వీసులు యధావిధిగా నడిచాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
నార్త్ ఇండియా అంతటా ఇదే పరిస్థితి
ఢిల్లీతోపాటు కోల్‌కతా, చండీగఢ్, అమృత్‌సర్, జైపూర్సహా నార్త్ ఇండియాలోని ఎయిర్‌పోర్ట్స్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో 25 విమాన సర్వీసులకు అంతరాయం కలుగగా.. రైల్వే సేవలు నెమ్మదించాయి. ఇక ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కర్నాల్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొన్నది. దీంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడి, చాలాచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పొగమంచు కారణంగా హర్యానాలోని హిసార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్
ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేసింది. 6న తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా వనస్థలిలో అత్యల్పంగా 6.4 డిగ్రీల సెల్సియస్ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్టు ఐఎండీ తెలిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయం వరకు కాశ్మీర్, చీనాబ్ లోయ మధ్య, ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే చాన్స్ ఉన్నదని పేర్కొన్నది.