- సాగు విధానాలు, ఆధునాతన పరికరాలపై 28 నుంచే స్టాళ్లు
- సదస్సుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి
- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30 మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించేలా అక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కరోజు కాకుండా.. ఈ నెల 28 నుంచి మూడు రోజులపాటు స్టాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ శాఖపై శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.
రైతు సదస్సుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని రైతులందరూ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లల్లో ఉంచాలని సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు..
అన్నింటినీ అక్కడ ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కాగా, 23 లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఆధార్ నంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో పేర్ల తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను అందించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎంవో స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.