పదేండ్లలో ఒక్క గ్రూప్1 పోస్టు కూడా భర్తీ చేయలే: బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: ఓట్ల కోసం సీఎం కేసీఆర్ ఎంతకైనా దిగజారతారని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని తెలిసి ఓటర్లకు గాలం వేసేందుకు గణేశ్ మండపాలకు దొంగ చాటుగా రూ.కోట్లు ఖర్చు చేస్తూ తాయిలాలు పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పదేండ్లుగా ఒక్క గ్రూప్1 పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు.

 రెండు సార్లు గ్రూప్1పరీక్ష రద్దు చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత, విద్యార్థుల తల్లిదండ్రులంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని కోరారు. స్కీంల పేరుతో స్కాంలు, పరీక్షల పేరుతో లీకేజీలు, సొంత కుటుంబానికే నియామకాలు, సర్కారు సొమ్ముతో సొంత డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో ఇంతకంటే సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు.

 గ్రూప్ 1 పరీక్ష కోసం పదేండ్లుగా నిరుద్యోగులు కోచింగ్ ల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారని, అప్పులు చేసి ఇండ్లు తాకట్టు పెట్టి హైదరాబాద్ కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి రూ.3,116 చెల్లించాలన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు లెక్క కట్టి ఒక్కో నిరుద్యోగికి దాదాపు 1.80 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రధాని సభకు తరలిరండి

తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 1న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ రోజు మహబూబ్ నగర్ లో జరగబోయే విజయ సంకల్ప సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సంజయ్ కోరారు.