పదేండ్లలో నల్గొండ.. నిర్లక్ష్యమే నిండా మునిగింది

 

  • బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టూ కట్టలే 
  • పెండింగ్​ ప్రాజెక్టులూ ముంగటవడలే
  • ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ అమలుకాలే
  • పూర్తికాని ఎస్ఎల్​బీసీ, బ్రాహ్మణ వెల్లంల
  • ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు 


నల్గొండ, వెలుగు:  బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు సరికదా.. కనీసం ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కారు చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ కెనాల్​(ఎస్ఎల్​బీసీ), బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లనూ పూర్తిచేయలేదు. ఇక 2014 నుంచి 2023 వరకు మూడు అసెంబ్లీ ఎన్నికలు, సాగర్, హుజూర్​నగర్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వివిధ  ప్రాజెక్టులను ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్.. వాటి నిర్మాణంతో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. 

నెల్లికల్లు లిఫ్టును ఏడాదిలోగా పూర్తిచేస్తామని 2021లో నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారు. ఈ లిఫ్టును పూర్తిచేయకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్​రెడ్డి అదే బహిరంగ సభలో శపథం చేశారు. కానీ ఉప ఎన్నిక జరిగిన రెండేండ్ల తర్వాత కూడా నెల్లికల్లు లిఫ్ట్ స్కీం పూర్తి కాలేదు, జగదీశ్​రెడ్డి రాజీనామా చేయలేదు. 2015లో అధికారంలోకి వచ్చేందుకు డిండి లిఫ్ట్ ఇరిగే షన్ స్కీంను తెరపైకి తెచ్చిన కేసీఆర్ మళ్లీ 2022లో మునుగోడు ఉప ఎన్నిక వచ్చేంత వరకు ఆ ప్రాజెక్టుపై నోరు మెదపలేదు. ఉప ఎన్నికల్లో గెలిపిస్తే డిండి ప్రాజెక్టును నెలరోజుల్లో కంప్లీట్ చేసి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పిన కేసీఆర్​ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పది లక్షల ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు నల్గొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న వాగ్దానం కూడా నెరవేరలేదు. 

19 ఏండ్లుగా సాగుతున్న ఎస్ఎల్​బీసీ 

శ్రీశైలం బ్యాక్​వాటర్ నుంచి టన్నెల్ ద్వారా గ్రావిటీ రూపంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో 2005లో ఎస్ఎల్​బీసీ టన్నెల్​ప్రాజెక్టుకు రూ.1,925 కోట్లతో అప్పటి కాంగ్రెస్ సర్కారు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఎస్ఎల్​బీసీ టన్నెల్–1 నుంచి కృష్ణా జలాలు గ్రావిటీ ద్వారా డిండి రిజర్వాయర్​లోకి వస్తాయి. అక్కడి నుంచి టన్నెల్– 2 ద్వారా పెండ్లిపాకల రిజర్వాయర్​లోకి చేరుతాయి.అయితే, టన్నెల్1 పనులు 43 కిలోమీటర్లకుగాను ఇప్పటివరకు 33 కిలోమీటర్లు, టన్నెల్ 2 పనులు 7.13 కిలోమీటర్లకు గాను 3.32 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. 2017లోనే బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.3,152 కోట్లకు పెంచింది. గతేడాది వరకు రూ.2,359 కోట్ల పనులు పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఫండ్స్​రాకపోవడంతో పనులు వెనుకబడ్డాయి. ఈ లోగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమని సాగర్ రిజర్వాయర్ దిగువ భాగంలో సుంకిశాల వద్ద రూ.వెయ్యి కోట్లతో  కొత్త లిఫ్టు స్కీంకు బీఆర్ఎస్ సర్కారు అనుమతిచ్చింది. నిజానికి ఎస్ఎల్​బీసీ టన్నెల్​గడువులోగా పూర్తయితే నల్గొండ జిల్లాతోపాటు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా నీటిని తరలించే వీలుండేది. కానీ దానిని పక్కనపెట్టి ఆగమేఘాల మీద సుంకిశాల లిఫ్టుకు పర్మిషన్ ఇవ్వడాన్ని రిటైర్డ్ ఇంజినీర్లు తప్పుపట్టినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ప్రశ్నార్థకంగా డిండి లిఫ్ట్ స్కీం..

డిండి లిఫ్టు స్కీములో భాగంగా 2015లో శివన్నగూడెంలో అప్పటి సీఎం కేసీఆర్ తొమ్మిది రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. ఈ స్కీము కింద మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని సుమారు 3.41 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో 2015లో రూ. 6,194 కోట్లతో పనులకు అనుమతిచ్చారు. కాగా, ఇన్​టైంలో ఫండ్స్ రాకపోడం వల్ల ఈ లిఫ్ట్ స్కీం కింద చేపట్టిన రిజర్వాయర్ల పనులన్నీ పెండింగ్​లో పడ్డాయి. 2016లో రూ.178 కోట్ల అంచనా వ్యయంతో సాంకేతిక అనుమతులు పొందిన గొట్టిముక్కల రిజర్వాయర్ ను మూడేళ్లలోనే పూర్తి చేయాలి. కానీ నాటి బీఆర్ఎస్​ప్రభుత్వం.. నీటి కేటాయింపులు జరగలేదని, ఫండ్స్​లేవని పెండింగ్​పెడ్తూ వచ్చింది. చివరకు 2021లో నేషనల్ గ్రీన్ ట్యిబ్యునల్ స్టేను సాకుగా చూపించి పనులు ఆపేసింది. 

ఆ తర్వాత ఎన్జీటీ గ్రీన్​సిగ్నల్ ఇచ్చినప్పటికీ పూర్తిచేయలేదు. డిండి లిఫ్ట్ స్కీంలో భాగంగానే 2015లో రూ.676 కోట్లతో పరిపాలనా అనుమతులు పొందిన సింగరాజుపల్లి రిజర్వాయర్​పనులను పెండింగ్​బిల్లుల కారణంగా కాంట్రాక్ట్​ ఏజెన్సీ నిలిపివేసింది. భూసేకరణకు సంబంధించి రైతులకు సైతం రూ.21 కోట్లను అప్పటి సర్కారు పెండింగ్​లో పెట్టింది. శ్రీశైల సొరంగ మార్గంలో భాగంగా చేపట్టిన పెండ్లిపాకల రిజర్వాయర్​దీ ఇదే పరిస్థితి. 2013లో రూ.571 కోట్లకు సర్కారు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వివిధ కారణాలతో 2017లోనే  కాంట్రాక్టు సంస్థ పనులను ఆపేసింది. రిజర్వాయర్ కోసం అవసరమైన 2,609 ఎకరాలకు గాను ఇంకా 799 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. దీంతో భూసేకరణకు రూ.100 కోట్లు, పునరావాసానికి రూ.300 కోట్లు, ప్రాజెక్టు పెండింగ్​పనులకు  రూ.600 కోట్లు కావాలని అప్పటి ఇంజినీరింగ్ అధికారులు బీఆర్ఎస్​సర్కారుకు ప్రపోజల్స్ పెట్టినా పైసా ఇవ్వలేదు. దీంతో పెండ్లిపాకల రిజర్వాయర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

పూర్తికాని కాల్వలు 

మూసీ నీటిని గ్రావిటీ ద్వారా తరలించి చెరువులు నింపేందుకు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వల నిర్మాణానికి 2014 అక్టోబర్​లో బీఆర్ఎస్ సర్కార్ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. 2017 ఫిబ్రవరిలో సాంకేతిక అనుమతులూ వచ్చాయి. ఈ మూడు కాల్వల అంచనా వ్యయం రూ.284.85 కోట్లు. కాగా, 2017 సెప్టెంబర్​లో రూ.221 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. ఈ కాల్వల ద్వారా దాదాపు175 చెరువులు నింపడంతోపాటు16 మండలాల పరిధిలోని 131 గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉంది. రూ.231 కోట్లకుగాను రూ.145 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.86 కోట్లు ఇస్తే పనులు కంప్లీట్ అయ్యేవి. అధికారులు ఎన్నిసార్లు ప్రపోజల్స్​పెట్టినా ఫండ్స్​విడుదల కాకపోవడంతో కాలువ పనులన్నీ పెండింగ్​లో పడ్డాయి.    

ఆగిపోయిన నెల్లికల్లు.. 

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాదిలోగా నెల్లికల్లు లిఫ్టు స్కీం పూర్తిచేస్తామని నాటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. సాగర్ బ్యాక్​వాటర్​నుంచి తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లు వద్ద ఏర్పాటుచేసిన లిఫ్టు స్కీం ద్వారా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 25 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ స్కీంకు 2021 ఆగస్టు 8న నాటి బీఆర్ఎస్ సర్కారు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2022 జూన్ లో రూ.539.910 కోట్లతో కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నది. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.8.05 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.531 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. 

బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం.. 

ఎస్ఎల్​బీసీలో భాగంగా నార్కట్​పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలలో 3 టీఎంసీల కెపాసిటీతో 2007లో చేపట్టిన ఉదయసముద్రం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 674.67 కోట్లు. ఇప్పటివరకు రూ.427 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం 3, 847 ఎకరాలకు గాను 1522 ఎకరాలు సేకరించారు. మరో 2,3 25 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ పనులు, భూసేకరణకు కలిపి రూ.160 కోట్లు, పెండింగ్​ బిల్స్ కోసం రూ.60 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉండగా.. నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. భూసేకరణ పూర్తయితే 40 చెరువులను నింపే అవకాశం ఉండేది.  

కేసీఆర్​ ఫౌండేషన్​ వేసిన డిండి పెండింగ్​లోనే..

ఎస్ఎల్​బీసీ లో భాగంగా టన్నెల్1,2 మధ్య 10 టీఎంసీలతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(నక్కలగండి)కి  2005లో నాటి కాంగ్రెస్ సర్కారు రూ.1,147 కోట్లతో అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఏపీలోనే రూ.500 కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్యాకేజీ, కొన్ని గేట్ల బిగింపు, కరకట్ట పనులు ఆగిపోయాయి. దీంతో 2019లో బీఆర్ఎస్ సర్కార్ రూ. 543 కోట్లతో రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. రూ.511 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.246 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు కంప్లీట్ కాదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సర్కారు నుంచి ఫండ్స్ రిలీజ్ కాలేదు.