ఇరిగేషన్​ డీలా..9 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలే

  •     ఉమ్మడి జిల్లాలో ముందుకు కదలని ప్రాజెక్టులు
  •     9 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలే

నల్గొండ, వెలుగు ; తెలంగాణ దశాబ్ది  ఉత్సవాల్లో భాగంగా బుధవారం  సాగునీటి దినోత్సవం జురుపుకోనుండగా జిల్లాలోని పెండింగ్​ ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయి. బీఆర్​ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల లో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదు. ఫ్లోరైడ్​ నియంత్రణలో భాగంగా చేపట్టిన డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం, దానికి అనుసంధానంగా నిర్మిస్తున్న తొమ్మిది రిజర్వాయర్ల పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ నీటి కేటాయింపులే ఇప్పటి వరకు జరగలేదు. తొమ్మిదేళ్ల నుంచి నాన బెడుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త నేషనల్​గ్రీన్​ ట్రిబ్యునల్​ అంశాన్ని తెరపైకి తెచ్చింది. పైగా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం వల్లే డిండి ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాల పరిధిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ల పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. 2015లో సీఎం కేసీఆర్​ శివన్నగూడెం రిజర్వాయర్​ వద్ద శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించారు. దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్లలోకి చుక్కునీరు కూడా చేరలేదు. నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో హామీ ఇచ్చిన నెల్లికల్లు లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీంతో సహా ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్​ కాలేదు. నెల్లికల్లు ప్రాజెక్టు కూడా ఉమ్మడి ఏపీలో జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కార్యరూపం దాల్చిందే. సాగర్ ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో తెరపైకి తీసుకొచ్చిన నెల్లికల్లు ప్రాజెక్టు ఏడాదిన్న రలో పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగి రెండేళ్లు కావొస్తున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. 

ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ప్రాజెక్టుల గతి అంతే..

ఉమ్మడి ఏపీలో తలపెట్టిన శ్రీశైల సొరంగ మార్గం, దానికి అనుసం ధానంగా నిర్మిస్తున్న పెండ్లిపాకల, నక్కలగండి, ప్రాజెక్టులు, బ్రహ్మ ణ వెల్లంల ఉదయ సముద్రం రిజర్వాయర్​ ప్రాజెక్టులు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్టుగా అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఎస్ఎల్​బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులు 30 శాతం పెండింగ్​ లో ఉన్నాయి.  నల్గొండ, మునుగోడు, నకిరేకల్​ నియోజకవర్గా సాగు, తాగునీరు ఇచ్చేందుకు బీవెల్లంల రిజర్వాయర్​ దివంగత సీఎం వైఎస్​ శంకుస్థాపన చేశారు. ఇదే ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పిన అయిటిపాముల రిజర్వాయర్​ ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఉమ్మడి ఏపీలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు తప్ప తెలంగాణ వచ్చాక జిల్లాలో పూర్తిచేసిన తాగు, సాగునీరు అందించిన ప్రాజెక్టు ఒక్కటీ లేదని, పైకి మాత్రం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్​, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.