సీఎం కాకముందు కేసీఆర్ ఆస్తి ఎంత ?. ఇప్పుడెంత? : బాబుమోహన్

మునుగోడులోని చండూరు రోడ్డులో నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం 

యాదాద్రి భువనగిరి జిల్లా: కేసీఆర్ దళితులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బీజేపీ నేత బాబుమోహన్ ఆరోపించారు. ప్రశ్నించినందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపిండని విమర్శించారు. సీఎం కాకముందు కేసీఆర్ ఆస్తి ఎంత ? ఇప్పుడు ఆయన కుటుంబ ఆస్తి ఎంత? వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని బాబు మోహన్ ప్రశ్నించారు. ఇవాళ మునుగోడులోని చండూరు రోడ్డులో జరిగిన నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకట స్వామి, బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ,  మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా తదితరులు పాల్గొన్నారు. 

భారీగా హాజరైన దళిత బంధువులనుద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి బాబు మోహన్ సీఎం కేసీఆర్ తీరు.. పాలనను తీవ్రంగా ఎండగట్టారు. ఒకరకంగా మునుగోడు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ కారణమని.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా కేసీఆర్ కారణమన్నారు. అసెంబ్లీ ఉన్నది  ప్రజల సమస్యలను పరిష్కరించడానికేనని.. ప్రశ్నించినదుకే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ నుంచి కేసీఆర్ బయటికి పంపిండని విమర్శించారు. రాజగోపాల్ రాజీనామా వల్లే గట్టుప్పల్ మండలం ఏర్పడిందని.. అలాగే కొత్త రోడ్లు, ఫింఛన్లు వచ్చాయన్నారు.  అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడవలసిన బాధ్యత సీఎం కేసీఆర్ మీద ఉంటే.. ఆయన మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

విలువైన ఓటును అబద్ధాలు చెప్పే వాళ్లకు వెయ్యకండి

ఓటు చాలా విలువైనదని.. అబద్దాలు చెప్పే వాళ్లకు అస్సలు వేయకూడదని బాబు మోహన్ అన్నారు. ఎవరికి ఓటు వేయాలో మునుగోడు ప్రజలు ఆలోచించి తేల్చుకోవాలని సూచించారు.  రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తాడని బాబు మోహన్ హామీ ఇచ్చారు.