- రూ.7వేల కోట్లు చెల్లిస్తే.. రూ.6వేల కోట్ల నష్టం ఎట్ల వస్తది
- ప్రభుత్వం, కమిషన్‌ను ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: చత్తీస్‌గఢ్ నుంచి 17వేల మిలియన్ యూనిట్ల కరెంట్ కొనుగోలుకు రూ.7 వేల కోట్లు చెల్లిస్తే.. రూ.6 వేల కోట్ల నష్టం ఎలా వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రభుత్వాన్ని, పవర్ కమిషన్‌ను ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం లేకపోతే 17 వేల మిలియన్ యూనిట్లకు రూ.17వేల కోట్లు కట్టాల్సి వచ్చేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ సర్కార్‌పై నిందలు వేయడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్లు ఏర్పాటు చేసింది. కమిషన్ విచారిస్తున్న నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదు. ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నరు. ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. తెలంగాణను సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వీరి కుట్ర’’అని అన్నారు.
ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాలి
విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల వ్యవహారంపై సీఎం రేవంత్, మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి ఎందుకు మాట్లాడడం లేదని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందన్న వార్తలోని ప్రతి అక్షరం అబద్ధమే అని అన్నారు. ‘‘నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారని కొందరు ప్రశ్నిస్తున్నరు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ఈ వివాదంపై కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలి. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను బంద్ చేయిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి అన్నడు. ఇప్పుడెట్ల ప్రారంభోత్సవానికి పోతడు? బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నడు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు చూస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే’’అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.