- హార్ట్ ఎటాక్‌తో భర్త మృతి
- బిల్డింగ్ పైనుంచి దూకి భార్య ఆత్మహత్య.. ఢిల్లీలో విషాదం
న్యూఢిల్లీ: ఇటీవల పెండ్లి చేసుకున్న ఓ యువ జంట సరదాగా జూపార్కుకు వెళ్లింది. అక్కడ భర్త ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోయాడు. అతని మరణాన్ని తట్టుకోలేక, భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆమె బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. పెండ్లి జరిగి మూడు నెలలు కూడా కాకముందే యువ దంపతులు చనిపోవడంతో వారి కుటుం బ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఢిల్లీలోని ఘజియాబాద్‌కు చెందిన అభిషేక్ అహ్లూవాలియా(25), గతేడాది నవంబర్ 30న అంజలి అనే యువతిని పెండ్లి చేసుకున్నాడు. కొత్త దంపతులు వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్ మెంట్‌లో కాపురం పెట్టారు. సోమవారం వారిద్దరూ సరదాగా ఢిల్లీలోని జూపార్కుకు వెళ్లారు. అక్కడ అభిషేక్‌కు ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అంజలి తన ఫ్రెండ్స్‌కు సమాచారం ఇచ్చి.. అతడిని గురుతేజ్ బహదూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ అభిషేక్ మృతి చెందాడు. అతని మృతికి గుండెపోటు కారణమని డాక్టర్లు నిర్ధారించారు. అభిషేక్ డెడ్ బాడీని వైశాలిలోని వారి ఇంటికి తీసుకురాగా.. భర్త మృతదేహాన్ని చూసి భార్య అంజలి తట్టుకోలేకపోయింది. వెంటనే అపార్ట్‌మెంట్ ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన అంజలిని వైశాలిలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె కూడా చనిపోయింది. కొత్త దంపతులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతున్నది.