-
ఆహ్వానించినందుకు థ్యాంక్స్
-
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: చరిత్రను తుడిచేసే ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 17న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలకు తాను హాజరుకానని తేల్చి చెప్పారు. తనను ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఆదివారం సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
‘‘సెప్టెంబర్ 17న అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం. అయితే.. చరిత్రను తొక్కిపెట్టి ప్రజల మనస్సుల్లోంచి విమోచన దినోత్సవాన్ని తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాలేను. ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విమోచనం దినోత్సవం’గా జరపాలి.
నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్ల కిరాతక పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం పొందేందుకు ఏండ్ల తరబడి పోరాడింది. రజాకార్ల హింసకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా రేవంత్ కు చరిత్ర అంతా తెలుసు’’అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వీరోచిత పోరాటం.. నిస్వార్థ త్యాగం.. బలిదానం అవ్వడమే.. తెలంగాణ చరిత్ర అని తెలిపారు.
అందుకే, సెప్టెంబర్ 17న వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రస్తుత తరానికి అప్పటి వారి ధైర్య, సాహసాలను తెలియజేసి జాతీయ భావన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నంగానే భావిస్తామన్నారు.