నా వల్ల కాదు.. నేనేం చేయలేను: ఎమ్మెల్యే సునీత

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  కొండపైకి ఆటోలు అనుమతించాలని ఎమ్మెల్యే ఇంటిముందు నిరసనకు దిగిన ఆటో కార్మికులతో మాట్లాడిన గొంగిడి సునీత... ఈ విషయంలో తానేం చేయలేనని, నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు.  అంతకుముందు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆటో కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. కొండపైకి నడిపించుకునే ఆటోలు బంద్ అయి ఇయ్యాళ్టితో 335 రోజులు పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే వెళ్లి ఆలయ ఈవోని అడగండి అంతా ఆమె చేస్తుందని ఎమ్మెల్యే సూచించారు. ఈవోతో మాట్లాడినా ఆమె వినలేదని, భూపాల్ రెడ్డితో మాట్లాడినా ఈవో వినడం లేదన్నారు. సీఎం దగ్గరికి వెళ్లి అడిగినా ప్రయోజనం లేదని తెలిపారు. మీరు ఆటోలు ఒక్కటే నడుపుతాం అని కాకుండా వేరే పనులు ఏవైనా చూసుకోవచ్చు కదా అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయంలో తన వంతుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానని. ఇక తన వల్ల కాదని, తానేం చేయలేనని ఎమ్మెల్యే చెప్పారు. మీరు ఏమైనా చేసుకోండి, నన్ను క్షమించండి అంటూ ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయారు.