
- సగం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి
- మిల్లర్ల మాట విని కొనుగోళ్లు ఆపిండ్రని ఆరోపణలు
- మబ్బులు, వానలతో వడ్లలో పెరుగుతున్న తేమ
- ఆ వంకతో ధర తగ్గిస్తరని రైతుల్లో ఆందోళన
- రైతుల ప్రశ్నకు, మా విమర్శలకు బదులివ్వలేకే
- ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
వెలుగు, నెట్వర్క్: రాష్ట్ర సర్కారు పేరుకే వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. చాలా సెంటర్లలో బ్యానర్లు కట్టి, కొబ్బరికాయలు కొట్టి కేంద్రాలను ఓపెన్ చేసి అక్కడితో సరిపెడుతున్నది. వారాలు గడుస్తున్నా వడ్లను కాంటా పెట్టిందే లేదు. రాష్ట్రవ్యాప్తంగా 6,500కు పైగా కొనుగోలుసెంటర్లు ఏర్పాటు చేస్తామని నెల కింద ప్రభుత్వం చెప్పింది. గురువారం నాటికి 5,027 సెంటర్లు ఓపెన్ చేశామని సివిల్‌సప్లైస్ శాఖ ప్రకటించింది. కానీ వాటిలో సగం సెంటర్లు కూడా నడుస్తలేవు. సూర్యాపేట జిల్లాలో 333 సెంటర్లకు 276 ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. కానీ 57 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొంటున్నారు. మిగతా సెంటర్లలో వడ్ల కుప్పల వద్ద రైతులు రాత్రీపగలు పడిగాపులు కాస్తున్నారు.
కోతలు మొదలై నెల దాటినా కొనుగోళ్లు స్పీడప్చేయకపోవడంతో రైతుల ప్రశ్నలకు, తమ విమర్శలకు బదులు చెప్పలేకే కేంద్రాల సంఖ్యపై తప్పుడు సమాచారంతో ప్రభుత్వం మభ్యపెడుతున్నదని అపోజిషన్ పార్టీలు మండిపడుతున్నాయి. మబ్బులు, వానల వల్ల వడ్లలో తేమ ఎక్కువ వస్తోందన్న మిల్లర్ల ఫిర్యాదు వల్లే కొనుగోళ్లు లేట్ చేస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
లేటుకు లక్ష కారణాలు
వారం నుంచి అడపాదడపా పడుతున్న వానలతో చాలా సెంటర్లలో, కల్లాల్లో వడ్లు తడిశాయి. కొన్నిచోట్ల మొలకలు కూడా వచ్చాయి. మబ్బు పట్టి ఉంటుండటంతో ఎంతకూ ఆరడం లేదు. దీంతో తేమ ఎక్కువ వస్తున్నదని మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదు. వాళ్లు చెప్పినందుకే చాలా సెంటర్లలో కావాలనే కొనుగోళ్లు లేట్చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగినట్లే గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మిల్లుల్లో వడ్లను అన్లోడ్ చేసుకోవడం లేదు. దీంతో శుక్రవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో వాసవి రైస్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల ఐకేపీ సెంటర్ నుంచి వడ్లను మూడు లారీల్లో చిన్నకోడూరు మండలం మేడిపల్లి మిల్లులకు పంపారు. అక్కడ మూడు రోజులుగా అన్లోడ్చేయలేదు. దీంతో కూరెల్ల సెంటర్లో కొనుగోళ్లు బందయ్యాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలానికి చెందిన పీఏసీఎస్ సెంటర్ నుంచి అదే మండలంలోని రైస్‌మిల్లుకు మూడు రోజుల క్రితం లారీలు వెళ్లాయి. కానీ తమ మిల్లులో ఖాళీ లేదని, దింపుకోవాలంటే పది రోజుల టైం పడుతుందని చెప్పడంతో లారీ డ్రైవర్లు పీఏసీఎస్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. ‘వీలైతే వచ్చి ఖాళీ చేయించండి.. లేదంటే లోడ్‌తో సహా రిటర్న్ వచ్చి మళ్లీ సెంటర్లోనే వడ్ల బస్తాలను దించేస్తాం’ అని తేల్చి చెప్పడంతో సిబ్బంది తలపట్టుకుంటున్నారు. ఇంకా కొన్నిజిల్లాల్లోనైతే ఇప్పటికీ లారీ ఓనర్లతో రవాణా అగ్రిమెంట్లే కాలేదు. ఖమ్మం జిల్లాలో 179 కేంద్రాలకుగాను 120 చోట్ల కొనుగోలు ప్రారంభించామని చెబుతున్నా పది సెంటర్లలో మాత్రమే కొంటున్నరు. ట్రాన్స్ పోర్ట్ అగ్రిమెంట్, మిల్లుల అలాట్ మెంట్ జరగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో 250 సెంటర్లకుగాను కేవలం 10 ఓపెన్ చేశారు. మిల్లులను మాత్రం అలాట్చేయలేదు. దాంతో ఆ పది సెంటర్లలోనూ కొనుగోళ్లు మొదలు కాలేదు. ఇక్కడ మిల్లర్లు సిండికేటై కావాలనే లేట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో కేవలం లారీల్లేని కారణంగా సుమారు 50 సెంటర్లలో కొనుగోళ్లు ఆగిపోయాయి.
నెలలో10 శాతం కూడా కొనలే
ఈ వానాకాలం 6 వేలకుపైగా సెంటర్ల ద్వారా కోటి 30 లక్షల టన్నుల వడ్లు కొనాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కానీ గురువారం వరకు 5,027 సెంటర్ల ద్వారా కేవలం 11.74 లక్షల టన్నులే కొన్నట్లు ప్రకటించింది. గత నెల రోజుల్లో 10 శాతం కూడా కొనలేదు. వడ్లు అమ్మిన వారంలో డబ్బులు అకౌంట్లలో వేస్తామని చెప్పినా ఈ విషయంలోనూ వెనకబడింది. ఇప్పటిదాకా రూ.2,483 కోట్ల విలువైన వడ్లు కొనగా, రైతులకు చెల్లించింది 231 కోట్లే.
రైస్‌మిల్లులో అన్లోడ్ చేసుకోవట్లే
మామిడాలపల్లి ఐకేపీ సెంటర్ నుంచి 150 బస్తాలను ఇక్కడి మిల్లుకు పంపి వారం రోజులు అయితంది. కానీ మిల్లు యజమాని అన్లోడ్ చేసుకుంటలేడు. ఏమైందని అడిగితే మా టార్గెట్ అయిపోయిందని, ఇక దింపుకోమని చెబుతున్నడు. మిల్లు అలాట్చేసి, కాంటా పెట్టి తెచ్చినంక అన్లోడ్ చేసుకోమంటే ఎట్లా?
- తిరుపతి, రైతు, మామిడాల పల్లి, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా
తేమ ఉందని వద్దంటున్నరు
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలో వరి కోతలు ముగిసి 36 రోజులైంది. దాదాపు 5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 5 వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదు. మాయిశ్చర్ ఉండి, నూక వస్తోందని తీసుకుంటలేరు. ఇలాంటి సాకులు చెప్పకుండా వడ్లు కొనాలి.
- లింగం యాదవ్, జూలూరు పీఏసీఎస్ చైర్మన్, యాదాద్రి జిల్లా