- గర్ల్స్కాలేజీ బిల్డింగ్ నిర్మాణం అటే పోయింది
- కాలేజీ ప్లేస్‌లో లైబ్రరీకి శంకుస్థాపన
- గర్ల్స్, బాయ్స్ కాలేజీలు కలిపి కోఎడ్యుకేషన్‌కు కుట్ర
- పెద్దపల్లికి వచ్చే విద్యాసంస్థలు వేరే ప్రాంతాలకు తరలుతున్నయ్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి శాంక్షన్ అయిన కాలేజీలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే నడుస్తున్న విద్యాసంస్థలు సమస్యల్లో ఉండగా.. కొత్తగా వచ్చేవి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఈక్రమంలోనే గర్ల్స్ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. శిథిలమైన కాలేజీ స్థలంలో ఇటీవల లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే గర్ల్స్ క్లాసులు బాయ్స్ కాలేజీ ల్యాబ్‌ల్లో నిర్వహిస్తున్నారు.
రానున్న రోజుల్లో బాయ్స్, గర్ల్స్ కాలేజీలను కలిపి కోఎడ్యుకేషన్ చేయడానికి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఎలిగేడు మండల కేంద్రంలో గురుకుల జూనియర్ కాలేజీ మంజూరు కాగా గోదావరిఖనికి తరలించారు. తాజాగా పట్టణంలోని గర్ల్స్జూనియర్ కాలేజీని కూడా లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎడ్యుకేషన్‌ను నిర్లక్ష్యం చేస్తున్నరు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ బిల్డింగ్ శిథిలమైపోయింది. దాన్ని రెండేళ్ల కిందనే మూసేశారు. బిల్డింగ్ నిర్మాణానికి ఆనాడే ప్రభుత్వానికి రూ. 2 కోట్లతో ప్రపోజల్ పంపారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో గర్ల్స్ ఇంటర్ క్లాసులు బాయ్స్ జూనియర్ కాలేజీ ల్యాబ్‌ల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్ సైన్స్ గ్రూపులకు ప్రాక్టికల్ ల్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఈక్రమంలో వారం కింద మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో గర్ల్స్కాలేజీ స్థలంలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. దీంతో కాలేజీ నిర్మాణం పక్కకు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే లైబ్రరీకి స్థలం కేటాయించినట్లు సమాచారం. దీనిపై ఇంటర్అధికారులు కూడా స్పందించడం లేదు.
పెద్దపల్లి జిల్లాలో ఎడ్యుకేషన్ నిర్లక్ష్యానికి గురవడానికి స్థానిక ప్రజాప్రతినిధులే కారణమన్న ప్రచారం ఉంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గర్ల్స్జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, శాంక్షన్ అయిన కాలేజీలను కూడా కాపాడలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త బిల్డింగ్ కోసం విద్యార్థులు చాలాసార్లు ఆందోళన చేశారు. తాజాగా ఆదివారం విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు.
గర్ల్స్ జూనియర్ కాలేజీకి బిల్డింగ్ కట్టాల్సిందే
గర్ల్స్ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ కోసం కేటాయించిన స్థలంలో కాలేజీ కట్టాల్సిందే. ప్లాన్ ప్రకారం గర్ల్స్ జూనియర్ కాలేజీ లేకుండా చేసి లబ్ధి పొందాలని స్థానిక ప్రజాప్రతినిధులు చూస్తున్నరు. ఎట్టి పరిస్థితిల్లో కాలేజీని పెద్దపల్లి నుంచి పోనివ్వం. విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తం.
- రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి