పోరాటాలను నియంత్రించడం కాదు.. పారదర్శక విచారణ కావాలి : సర్దార్​ వినోద్ ​కుమార్

తెలంగాణలో రాజ్యాంగబద్ద సంస్థ అయిన టీఎస్​పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. అర్హతలేని, సామర్థ్యంలేని సభ్యులు, బోర్డును పట్టించుకోని చైర్మన్, ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం​ వెరసి.. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యుగులు, ఉద్యోగార్థుల భవిష్యత్​ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు హిందీ పండిట్ రేణుక చేసిన తంతు బజారు కెక్కడంతో టీఎస్​పీఎస్సీ నగ్న రూపం తెలంగాణ సమాజానికి సాక్షాత్కారం అయింది. తీగలాగితే డొంకఅంతా కదిలింది. పకడ్బందీ పర్యవేక్షణలో ఎంతో రహస్యంగా ఉండే పరీక్షా పేపర్లు లక్షల రూపాయలకు, ప్రభుత్వ అధినేతల బలగానికి, బంధుమిత్రుల చేతికి చేరడం, తెరవెనుక సూత్రదారుల విషయాలు బయటకు వస్తుంటే గుండె చెరువవుతోంది.

తెలంగాణ యువత స్వరాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టింది. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్ధన్​రెడ్డి మీడియా సమావేశంలో జాలి మొఖంతో నమ్మిన వాళ్లే మోసం చేశారని చెప్పడం ఎంత విడ్డూరం! తెలంగాణ నిరుద్యోగులు 9 సంవత్సరాలుగా కండ్లళ్ల ఒత్తులేసుకొని చూడగా, ఎన్నో నిరసనలు చేయగా, ఎన్నికల ముందు వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్స్​వచ్చాయి. వచ్చిన నోటిఫికేషన్లలో మెజార్టీ ప్రకటనలు న్యాయ చిక్కుల్లో ఉండగా, మిగతా వాటినైనా పారదర్శకంగా భర్తీ చేస్తారనుకుంటే అదీ లేదు. సర్కారు కొలువు కోసం ఏండ్ల తరబడి లైబ్రరీల్లో చదువుతున్న నిరుద్యోగ యువతకు పిడుగు లాంటి వార్త వినపడింది. “పేపర్ లీకేజీ” వారి ఏకాగ్రతను, మనో ధైర్యాన్ని దెబ్బతీసింది. 

విచారణలో పారదర్శకత ఎంత?

రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటుతున్న నిరసనలు, ఆందోళనల మధ్య రంగ ప్రవేశం చేసిన ‘సిట్’ దర్యాప్తును నిరుద్యోగులు, ఉద్యోగార్థులు పూర్తిగా నమ్మడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో వివిధ సందర్భాల్లో ఏర్పాటైన సిట్​లు ఆయా కేసులను ఎటూ తేల్చలేకపోయాయి. ప్రభుత్వ ప్రమేయం, ఒత్తిడి, ఆదేశాల ప్రకారమే సిట్​దర్యాప్తు సాగుతుంది.. కానీ పారదర్శకంగా బాధితుల పక్షాన విచారణ కొనసాగుతుందని చెప్పలేం. ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై ప్రతిపక్ష లీడర్ల నుంచి ఆరోపణలు వస్తున్నా..  సిట్​అధికారులు వాటిని ఎంత వరకు వాటిని సీరియస్​గా తీసుకొని నిజాలు నిగ్గు తేలుస్తారన్నది చూడాలి. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే.. దానికి నైతిక బాధ్యత వహిస్తూ.. రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసిన చరిత్ర మన దేశంలో ఉన్నది. కానీ టీఎస్​పీఎస్సీ పేపర్లు అంగట్లో సరుకులా బేరం పెట్టే వరకు బోర్డు చైర్మన్​నిద్రపోయారా? పేపర్​లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆయన పాలనా పరమైన అసమర్థత వల్లే కదా? ఇంటి దొంగలు పేపర్లు లక్షల రూపాయలకు అమ్ముకున్నది.

ఢిల్లీ లిక్కర్​స్కామ్​కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరైతే.. ఏం జరుగుతుందోనని ముఖ్యమైన మంత్రులు సహా అరడజను మినిస్టర్లు ఢిల్లీకి పోయి.. పగలు రాత్రి పడిగాపులు కాస్తారు? మరి 30 లక్షల మంది భవితవ్యానికి సంబంధించి పేపర్​లీక్​కేసును ఎందుకు ఆ స్థాయిలో సీరియస్​గా తీసుకోరు? అస్సాంలో ఓ హెచ్​ఎం పదో తరగతి ప్రశ్న పత్రం లీక్​చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ఇది కచ్చితంగా తమ ప్రభుత్వ వైఫల్యమే అని ఒప్పుకున్నారు. లీక్‌‌ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గ్రూప్​1 ప్రశ్నా పత్రం న్యూజిలాండ్​వరకు వెళ్లి.. తెలంగాణ పాలన అపఖ్యాతి ఖండంతరాలు విస్తరిస్తే.. దీనిపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయం.

మంత్రుల మాటలు.. పుండు మీద కారం

పేపర్ ​లీకేజీతో ఇప్పటికే మనోధైర్యం కోల్పోయి.. మళ్లీ పుస్తకాలు పట్టుకుందామంటేనే ఇబ్బంది పడుతూ ఒకవైపు నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్​ పార్టీ లీడర్లు చేస్తున్న వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు ఉంటున్నాయి. పేపర్​ లీక్ ​కామన్​.. గతంలో జరిగిందని ఓ మంత్రి అంటే.. పేపర్​ లీక్​తో మాకేం సంబంధమని ఇంకో మంత్రి సెలవిస్తారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కోటి ఆశలతో ఆకలి కడుపుతో పట్నం వచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతున్న 30 ఏండ్ల వయసుపైబడిన నిరుద్యోగి కంట నీరు కారుతోంది. ఆ కన్నీళ్లను తుడిచే వారే లేరు. ఒక్కపూట భోజనంతో కాలం వెళ్లదీస్తూ కష్టపడి చదివి ప్రిలిమ్స్ విజేతగా నిలిచిన ఎందరో.. రేపు మళ్లీ ఎగ్జామ్​ రాయలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా టీఎస్ ​పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, అధికారులందరూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలి. గతంలో వచ్చిన నోటిఫికేషన్లనూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత శాఖ మంత్రిని బర్తరఫ్ చెయ్యాలి. సిట్ విచారణపై నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్​జడ్జితో లేదా సీబీఐతో మొత్తం కేసును దర్యాప్తు చేయించాలి. ప్రభుత్వ జోక్యానికి లొంగకుండా దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. ఇప్పటికే చతికిల పడిన నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నగదు సాయం కింద 30 లక్షల మంది నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించాలి. వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలి. స్పష్టమైన తేదీలు ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ అమరవీరుల ఆశయాలు కాస్తయినా సాకారం అవుతాయి. లేదంటే ఇలాంటి తెలంగాణ కోసమేనా మేము ప్రాణాలర్పించినదని వారి ఆత్మలు ఘోషిస్తాయి. 1200 మంది విద్యార్థి, అమరులు తమ ప్రాణాలను అర్పించి సాధించిన తెలంగాణ ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా 200 మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బంగారు తెలంగాణలో బంగారం ఒకరిదైతే.. బాధలు అందరివి అన్నట్లు ఉన్నది. 

మరో పోరాటానికి ఓయూ వేదికవుతుంది..

ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనలపై ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపుతున్నది. నాటి ఆంధ్రా పాలకుల లాగా నిర్బంధం విధిస్తున్నది. లాఠీ దెబ్బలు, నిర్బంధాలు ఓయూకు, విద్యార్థి సంఘాలకు కొత్త కాదు. ఆందోళనలు, నిరసనలను నియంత్రించడంపై దృష్టి సారించడం కంటే, జవాబుదారీ పాలన, పారదర్శకమైన ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఎంత సేపు ఓట్లు.. సీట్ల గురించి ఆలోచించి.. పాలనను గాలి కొదిలేస్తే.. ఎలాంటి అనార్థాలు జరుగుతాయో ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమ గడ్డ. ఎందరో నియంతలను, నైజాంలను తరిమికొట్టి.. స్వేచ్ఛా వాయువులను పీల్చిన నేల. ఈ విషయాన్ని పాలకులు యాదిలో ఉంచుకోవాలి. 30 లక్షల మంది నిరుద్యోగులు సహా రాష్ట్రంలో కోటి మందిని ప్రభావితం చేసిన టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను పక్కదారి పట్టిద్దాం.. ప్రజా దృష్టి నుంచి దారి మళ్లిద్దాం.. ఎప్పటిలాగే పాలన సాగిద్దాం అనుకుంటే పొరపాటు. తెలంగాణ ఉద్యమ్యానికి ఊపిరిలూదిన ఉస్మానియా యూనివర్సిటే.. మరో పోరాటానికి సమర శంఖం పూరిస్తుంది. తస్మాత్​ జాగ్రత్త! - సర్దార్​ వినోద్ ​కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీజేఎస్​ విద్యార్థి విభాగం