ఆత్రేయతో జర్నీ అంత ఈజీ కాదు

రెండున్నర గంటల పాటు సినిమా చూసి క్షణాల్లో తీర్పు చెప్పేస్తాం. కానీ తన మదిలో మెదిలిన ఆలోచనను
సినిమాగా తీసుకురావడానికి ఒక దర్శకుడు ఎంతో కసరత్తు చేస్తాడు. ఆ ప్రయాస సామాన్యమైనది కాదు. అంత కష్టపడకపోతే విజయమూ దక్కదు. సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకులు రైటింగ్ నుంచి మేకింగ్ వరకు చేసిన ప్రయాణాన్ని తెలియజేసేదే ఈ శీర్షిక.

రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. దానితో సంబంధం లేని పరాయివాడికి అది వార్త. కానీ ఆ క్రైమ్‌‌లో ఆప్తుల్ని కోల్పోయినవారికది గుండెకోత. అయితే పరాయివాడై ఉండి కూడా బాధితుడిలా
గుండెకోతను అనుభవించేవాడు ఒకడుంటాడు. అతడే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్. అతడు యూనిఫామ్ వేయని పోలీస్. అతని అంతిమ లక్ష్యం జస్టిస్. క్రైమ్ వల్ల జరిగిన నష్టం కలిగించే బాధని అనుభవించకపోతే నేరస్తుడి అంతుచూడాలన్న కసి అతడిలో రాదు. ఆ కసి లేకపోతే లక్ష్యం నెరవేరదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఆ కసి ఉంది. అందుకే అతని లక్ష్యం నెరవేరింది. అతణ్ని సక్సెస్ చేయాలనే కసి దర్శకుడు స్వరూప్‌‌లో కూడా ఉంది. అందుకే అతనికి హిట్ దక్కింది. ఆత్రేయతో స్వరూప్‌ జర్నీ.. ఆయన మాటల్లోనే…

నేను గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ అనుభవంతో సినిమా తీయాలనే నిర్ణయానికొచ్చాను. షార్ట్ ఫిల్మ్‌కి, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ తీయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలుసు. కానీ తీయగలననే నమ్మకంతో మొదలుపెట్టాను. నా ముందున్న మొదటి చాలెంజ్.. ఎలాంటి సినిమా తీయాలి?

అలా మొదలైంది..
ప్రతి సినిమా ఒక ఆలోచనతో మొదలవుతుంది. నేను సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలాంటి సినిమా తీయాలా అని చాలా ఆలోచించా. ఇటీవలి కాలంలో రాని జానర్‌‌‌‌ ఏముందా అని సెర్చ్‌‌ చేస్తుంటే డిటెక్టివ్‌ నా మనసులో కదిలాడు. మన దగ్గర స్పై ఫిల్మ్స్‌‌ వస్తున్నాయి కానీ లోకల్ టౌన్ డిటెక్టివ్ స్టోరీస్ వచ్చి చాలా కాలమైంది. చంటబ్బాయి, డిటెక్టివ్ నారదతో లాస్ట్. పైగా డిటెక్టివ్ మూవీస్ అంటే మనవాళ్లకి ఇష్టం కూడా. ‘చంటబ్బాయి’ సినిమా టీవీలో వచ్చినా, యూట్యూబ్‌‌లో కనిపించినా ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి నా సినిమా అదే జానర్‌‌‌‌లో రావాలని డిసైడయ్యాను. అలా మొదలైంది ఆత్రేయతో నా జర్నీ.

అంత ఈజీ కాదు
డిటెక్టివ్‌ మూవీ తీయడం అంత ఈజీ కాదు. ‘షెర్లాక్ హోమ్స్‌‌’లాంటివి గమనిస్తే డిటెక్టివ్‌ క్యారెక్టర్ కాస్త డ్రమటిక్‌‌గా ఉంటుంది. వాళ్లు ఓవర్‌‌‌‌ ద టాప్ బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా తీయాలి. ఓవర్‌‌‌‌ ప్లే చేస్తే అతి అనిపిస్తుంది. అండర్‌‌‌‌ ప్లే చేస్తే తేలిపోతుంది. బ్యాలెన్స్‌‌ చేయాలి. అదెలాగో తెలుసుకోడానికి డిటెక్టివ్ ఫిల్మ్స్‌‌ చూడాలని డిసైడయ్యా. నెల రోజుల్లో ఒన్‌‌లైన్ ఆర్డర్ రాసుకుని, సినిమాలు చూడటం మొదలుపెట్టాను. కాపీ కొట్టాలని కాదు. ఇన్‌‌స్పిరేషన్ కోసం. ముప్ఫై నలభై సినిమాలు చూసి స్టోరీని ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు, కాన్‌‌ఫ్లిక్ట్ ఎలా తెస్తున్నారు, పాత్రని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు వంటివన్నీ అర్థం చేసుకున్నా. మూడు నాలుగు నెలలు కష్టపడి డైలాగ్‌ వెర్షన్‌‌తో సహా స్క్రిప్ట్ తయారు చేశాను. నా డిటెక్టివ్‌ కోసం వేట మొదలుపెట్టాను.

పర్‌ ఫెక్ట్ చాయిస్
అందరూ కథ తయారయ్యాక నిర్మాతను కలుస్తారు. కానీ నేను ముందు హీరోతో ట్రావెల్ చేయాలనుకున్నాను. కథకి తగ్గ హీరోని తీసుకుని, అతను ఆ పాత్రను ఎలా పండిస్తాడో చూసుకుని, ఓకే అనుకున్న తర్వాత ముందుకెళ్లాలన్నది నా ఆలోచన. ఇక నా కథలో డిటెక్టివ్‌ ఎంత తెలివైన వాడో అంత హడావుడి కూడా చేస్తాడు. అంటే సీరియస్‌‌నెస్ ఉండాలి. అక్కడక్కడా ఫన్నీగా కూడా అనిపించాలి. అలా చేయాలంటే మంచి పర్‌‌‌‌ఫార్మర్
కావాలి. నెట్‌లో నవీన్‌‌ వీడియోస్‌‌ చూశాను. తనలో బేసిక్‌‌గానే హ్యూమర్‌‌‌‌ ఉంటుంది. కామెడీ అద్భుతంగా చేస్తాడు. పైగా హిందీలో చేస్తున్న తెలుగువాడు. అందుకే తనకి ఫిక్సైపోయాను. ఇద్దరం కలిసి ఎనిమిది నెలలు ట్రావెల్ చేశాం . తన యాక్టింగ్‌‌కి, బాడీ లాంగ్వేజ్‌‌కి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేయడం మొదలుపెట్టాం. అండర్‌‌‌‌ అనిపించిన చోట పెంచాం , ఓవర్ అనిపించిన చోట తగ్గించాం. నవీన్‌‌ కూడా బాగా ఇన్‌‌వాల్వ్ అయ్యాడు.
కామెడీ సీన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయసాగాడు. అప్పటికి డెబ్భై శాతం కథ ఉంది. మిగతా ముప్ఫై
శాతం ఇద్దరం కలిసి అవసరమైనట్టుగా తీర్చిదిద్దాం. కథ రెడీ. ఇక ప్రొడ్యూసర్‌‌‌‌ని పట్టుకోవడమే.

ఫేస్ బుక్‌లో ప్రొడ్యూసర్లందరికీ మెసేజులు పెట్టే వాణ్ని. రాహుల్‌‌ యాదవ్‌‌కి కూడా అలాగే పెట్టాను. స్క్రిప్ట్ పంపించమన్నాడు. పంపిస్తే చదివి ఓసారి రమ్మన్నా డు. నేరేట్ చేయమంటే చేశాను. నచ్చిందంటూ నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఫ్రెష్ నెస్ కోసం యాక్టర్స్‌ని కొత్తవాళ్లనే తీసుకోవాలనుకున్నాం. లిమిటెడ్ బడ్జెట్‌‌లో తీయాలన్నా అదే బెటర్. కాస్టింగ్ కాల్ ఇచ్చాం . నెలన్నర పాటు ఆడిషన్స్ చేసి అందరినీ సెలెక్ట్ చేశాం. బడ్జెట్‌‌ని కుదించడం కోసం సెట్స్ జోలికి పోకుండా నెలన్నర పాటు తిరిగి లొకేషన్స్‌‌ ఎంచుకున్నాం. సినిమాటోగ్రాఫర్‌‌‌‌ కోసం వెతుకుతుంటే మా ఫ్రెండ్‌‌ ద్వారా సన్నీ అనే ఆయన డెమో రీల్ వచ్చింది. తను యూరోప్‌‌లోని ఫిల్మ్ స్కూల్లో కోర్స్ చేసి, అక్కడ రెండు సినిమాలకి చేశాడు. కలిసి డిస్కస్ చేస్తే కంఫర్టబుల్‌‌ అనిపించింది. ఓకే అనుకున్నాం. ‘అ’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఇష్టం . దాంతో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌‌ మార్క్‌ని కలిసి సినిమా గురించి చెప్పాను. డిటెక్టివ్ సినిమాలంటే పాత రోజులు గుర్తొస్తాయి కనుక ఆ ఫీల్ తీసుకురమ్మని అడిగితే చక్కని థీమ్ మ్యూజిక్ చేశాడు. నాలుగున్నర నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. నవీన్‌కి నలభై అయిదు రోజుల పాటు వర్క్ షాప్ జరిగింది. అలాగే టెస్ట్ షూట్ చేశాం. అన్నీ పర్‌‌‌‌ఫెక్ట్ అనిపించాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

క్లయిమాక్స్‌లో టెన్షన్
సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ఏమవుతుందోనని టెన్షన్ పడినట్టు.. సినిమా అంతా అయిపోయాక చివరగా రిలీజ్ చేసేటప్పుడు నాకూ టెన్షన్ మొదలైంది. డిస్ట్రిబ్యూటర్ దొరకలేదు. దాంతో భయం వేసింది. ఎలాంటి సినిమా తీశాను, ఎందుకెవరూ ముందుకు రావట్లేదు, జనానికైనా నచ్చుతుందా లేదా అంటూ ఏవేవో సందేహాలు వచ్చేశాయి. కాన్ఫిడెన్స్‌‌ తగ్గసాగింది. కానీ ‘అర్జున్‌‌రెడ్డి’ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటరే దీన్ని రిలీజ్ చేయడానికీ ముందుకు రావడంతో లైన్ క్లియరైంది. కానీ చాలా తక్కువ థియేటర్లే వచ్చాయి. అయినా కూడా
మొదటి రోజు మొదటి ఆటకే హిట్ టాక్. టెన్షనంతా ఎగిరిపోయింది. నిజానికి చిన్న రిలీజే బెటరేమో. చూడాలనుకున్నవాళ్లంతా ఆ థియేటర్లకే వస్తారు. ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే
థియేటర్లు అవే పెరుగుతాయి. మా సినిమా విషయంలో అదే జరిగింది.

విజయవాడ వెళ్తే అక్కడ థియేటర్‌‌‌‌లో అరవై, డెబ్భయ్యేళ్ల వాళ్లు కూడా సినిమా చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వులు చూశాక మనసు ఆనందంతో నిండిపోయింది. రెండున్నరేళ్ల కష్టానికి ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం దక్కింది. ఒక మంచి సినిమా చేస్తే తప్పకుండా జనం చూస్తారు అనే నమ్మకంతో ప్రయాణం మొదలు పెడతాం. ఆ నమ్మకం నిజమని ప్రూవ్ అయినప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆత్రేయ నాకా ఆనందాన్ని కలిగించాడు. ఇప్పుడు కన్నడ, తమిళ, హిందీ భాషలకు కూడా వెళ్తున్నాడు. ఆత్రేయ ఈజ్‌‌ మై ఫస్ట్ హీరో. మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చిన బెస్ట్ హీరో.

డెడ్‌ బాడీస్‌‌ని పడేయడమనేది నైన్టీస్‌‌లో జరిగిన నిజ సంఘటన. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి నాకు చెప్పాడు. అది గుర్తుంది. మైసూర్‌‌లో జరిగిన అలాంటి ఇన్సిడెంట్‌ వీడియో కూడా చూశాను. దాంతో దానిపైనే సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. అయితే తగినంత మెటీరియల్ నా దగ్గర లేదు. పేపర్‌‌లో చదివి దాచుకున్న ఆర్టికల్స్‌‌ తిరగేశాను. ఫింగర్‌ ప్రింట్స్‌‌ స్కామ్, డివోషనల్‌‌ క్రైమ్ అనే పాయింట్స్‌ని కూడా లింక్‌‌ చేసి కథ తయారు చేశాను.
డైరెక్టర్​ స్వరూప్