
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో శామీర్ పేట ఎస్ఐ పరుశురామ్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. ఓ ఆయిల్ కంపెనీకి చెందిన వంట నూనెలను అక్రమంగా కొన్నారని ఓ వ్యక్తిపై ఎస్ఐ పరశురామ్ అభియోగం మోపి, తరచూ స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నాడు. ఈ కేసు విషయంలో ఫేవర్ చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో ఆ మొత్తాన్ని బాధితుడు తీసుకొచ్చి, ఎస్ఐ కారులో పెట్టాడు. ఆ తర్వాత ఇచ్చిన డబ్బుల్లో రూ.20 వేలు తక్కువగా ఉన్నాయని, మరో రూ.2 వేలు కానిస్టేబుల్కు ఇవ్వాలని చెప్పాడు. స్టేషన్కు వచ్చిన తర్వాత ఆ డబ్బులను తన పక్కన ఉన్న డస్ట్ బిన్ లో పెట్టాలని సూచించాడు. అయితే, అంతకుముందే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. సోమవారం డస్ట్ బిన్ లో డబ్బులు పెట్టిన తర్వాత ఎస్ఐ పరశురామ్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ అవినీతిలో ఎస్ఐతోపాటు సీఐ, ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.