ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన స్టూడెంట్లు, నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేయడంలో టీఆర్ఎస్ సర్కార్ 100% సక్సెస్ అయ్యింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని లక్షల కోట్లు ఖర్చు చేసి ఇప్పటికి పది లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. లిఫ్ట్ స్కీమ్‌ల పేరుతో ప్రజాధనమంతా టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబులోకి చేరిపోయింది. నీళ్లు లేవు. నిధులు మాత్రం మాయమయ్యాయి. ఇక నియామకాల కోసమే తమ బతుకులు పణంగా పెట్టి కొట్లాడిన స్టూడెంట్లు, నిరుద్యోగుల ఆశలను రాష్ట్ర సర్కార్ అడియాశలు చేసింది.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని అనుకున్న నిరుద్యోగుల నోట్లో రాష్ట్ర ప్రభుత్వం మన్ను కొడుతోంది. ఉద్యమం కోసం పదేండ్లు, సొంత రాష్ట్రంలో ఆరేండ్లు కలిపి మొత్తం 16 ఏండ్లు యువత జీవితాన్ని కోల్పోయారు. రాష్ట్ర సాధన కోసం 1,230 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయనే. కానీ ఆకాంక్ష ఇప్పటి వరకూ నెరవేరలేదు. సొంత రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు మరింత దారుణంగా తయారయ్యాయి. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేండ్లు గడిచినా నియామకాలు జరిగింది లేదు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 23 లక్షల మందిలో రెండు లక్షల 40 వేల మంది పోటీ పరీక్షలు రాసే వయోపరిమితి దాటిపోయారు. ఉద్యమంలో సర్వం కోల్పోయి, ఇప్పుడు నోటిఫికేషన్లు లేక ఆర్థిక ఇబ్బందులతో అరి గోస పడుతున్న వీరికి వయోపరిమితి పెంచాలి.
టీఆర్ఎస్ సర్కార్ పతనం మొదలైంది
నిరుద్యోగులకు పోటీ పరీక్షలు రాసే వయసు దాటిపోతోందని రాష్ట్ర సర్కార్ ఆలోచించలేదు. ఉద్యోగ ఖాళీలను నింపే ప్రయత్నం చేయలేదు. కానీ, అడగకుండానే కొంత మంది టీఆర్ఎస్ అనుబంధ ఉద్యోగ సంఘాల కుటుంబ సభ్యుల కోసం రిటైర్మెంట్ వయసును 58 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటు. ఒక తరాన్ని నాశనం చేసి, స్టూడెంట్లు, నిరుద్యోగుల సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తూ టీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై యువత భగ్గుమంటోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. త్వరలో జరిగే వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్లు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పతనాన్ని చూడబోతున్నాం.
నిరుద్యోగ భృతి ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్
రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్‌కు నిరుద్యోగ భృతి గుర్తొచ్చింది. నిరుద్యోగులు, స్టూడెంట్లు ఏటా ఉద్యోగ ఖాళీల క్యాలెండర్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నెలకు మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే రెండేండ్లు గడిచింది. చిత్తశుద్ధి ఉంటే నెలకు మూడు వేల చొప్పున 24 నెలలకు రూ.72 వేలను నిరుద్యోగుల అకౌంట్లలో జమ చేయాలి.
లక్షా 91 వేల 126 ఖాళీలు
రాష్ట్రంలో లక్షా 91 వేల 126 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిటీ తన రిపోర్ట్‌లో స్పష్టంచేసింది. మొత్తం 4,91,304 పోస్టులకు ప్రస్తుతం మూడు లక్షల 178 మందే(61శాతం) పనిచేస్తున్నట్లు వెల్లడించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 83 వేల మంది ఆంధ్రా వాళ్లు తెలంగాణలో అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. వారిని ఏపీకి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ యువతను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎంత మందిని ఏపీ పంపించారో.. ఎంతమంది తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. ఈ ఆరున్నరేండ్లలో లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నింపామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలపై పల్లా బహిరంగ చర్చకు రావాలి. ఎక్కడ పోస్టులు నింపారో ప్రజా దర్బార్ లో తేల్చాలి.
ఏజ్ లిమిట్ పెంపు అసలు రహస్యం ఇదే
2021–22 సంవత్సరాల్లో 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వారికి బెనిఫిట్స్ కింద ఒక్కొక్కరికి రూ.60 లక్షల నుంచి 80 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాలి. ఈ బెనిఫిట్స్ కింద కనీసం రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 2023లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి రాదని టీఆర్ఎస్ పెద్దలకు అర్థమైంది. ఉద్యోగుల బెనిఫిట్స్ భారం తక్షణం పడకుండా తర్వాత వచ్చే ప్రభుత్వం ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్‌ను పెంచాలని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది.
ఏజ్ లిమిట్ పెంపు వల్ల ఎన్నో నష్టాలు
రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల ఇప్పటికే ఉద్యోగాల కోసం దశాబ్దన్నర కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు రిటైర్ కావాల్సిన ఉద్యోగులు మరో రెండేండ్లు కొనసాగితే కొత్త ఖాళీలు ఉండవు. వయసు పైబడిన ఉద్యోగుల వల్ల వర్క్ స్పీడ్ తగ్గుతుంది. 58 ఏండ్లు నిండిన ఒక్కో ఉద్యోగికి ఇచ్చే వేతనంతో ఐదుగురు కొత్త వారికి ఉద్యోగం కల్పించవచ్చు. పనివేగం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ఎవరూ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని కోరడం లేదు. కేంద్రం మాదిరిగా జీతం స్కేల్ ఉండాలని, సమయానికి పీఆర్సీ ప్రకటించాలని, ఇన్నేండ్లు సర్వీస్ చేసినందుకు రిటైర్మెంట్ తర్వాత పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నికై ఐదేండ్లు కూడా పని చేయకపోయినా ప్రజాప్రతినిధులకు పింఛన్ వర్తిస్తుంది. అలాంటిది 30 ఏండ్లు సర్వీస్ లో ఉన్న తమకు ఎందుకు పింఛన్ ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. కానీ, వారడిగినవి ఇవ్వకుండా కొంత మంది నాయకుల కుటుంబాల కోసం రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామనడం రాష్ట్ర ప్రభుత్వ పతనానికి నాందిగా కనిపిస్తోంది.
అసలు ఉద్యోగ ఖాళీలు ఎన్ని?
రాష్ట్రంలో లక్షా 91 వేల 126 శాంక్షన్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. శాంక్షన్డ్ పోస్టులంటే న్యాయపరంగా క్లియరెన్స్ ఉండి, ఆర్థిక శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ల ఆమోదం పొందిన పోస్టులని అర్థం. ఇవి కాక 43 ప్రభుత్వ శాఖల్లో ఆమోదం పొందకుండా పెండింగ్ లో అనేక ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో 591 మండలాలుంటే 18 మంది ఎంఈవోలే ఉన్నారు. మిగతా 573 మంది ఇన్‌చార్జ్‌లే అని ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా తెలుస్తోంది. 17 మోడల్ స్కూల్స్, 119 బీసీ గురుకులాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీలు లేరు. ప్రభుత్వ బడుల్లో 1983 నుంచి ఇప్పటి వరకు స్వీపర్లు, అటెండర్ల పోస్టులు భర్తీ కాలేదు. ఇలా తవ్వే కొద్దీ సర్కార్ డొల్లతనం బయట పడుతూనే ఉంటుంది. ఇవే కాకుండా 23 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 7 కొత్త పోలీస్ కమిషనరేట్లు, 24 కొత్త సబ్ డివిజన్లు, 29 కొత్త సర్కిళ్లు, 102 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో జిల్లాకు 5 వేల ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అయినా మరో లక్షా 15 వేల ఉద్యోగాలు అవసరం అవుతాయి. ఇవన్నీ కలిపితే 3 లక్షలకు పైగా ఖాళీలు ఉంటాయి. ఇన్ని ఖాళీలున్నా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేయడం సిగ్గు చేటు. మొత్తం ఖాళీలన్నీ భర్తీ చేయాలని స్టూడెంట్లు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ ఏజ్ పెంపు మానుకోవాలని, నిరుద్యోగులకు పోటీ పరీక్షలు రాసే వయో పరిమితి పెంచాలి. లేదంటే రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదు. దీంతో టీఆర్ఎస్ సర్కార్ కూలడం ఖాయం.
– సిద్ధగౌని సుదర్శన్,
ఉస్మానియా యూనివర్సిటీ
స్టూడెంట్ జేఏసీ నేత