హీరోలకి కాదు.. నష్టం నిర్మాతలకే

హీరోలకి కాదు.. నష్టం నిర్మాతలకే

ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచడం, మరోవైపు ఏపీ ప్రభుత్వం తగ్గించడం ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్టుందన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సమర్పణలో రూపొందిన ‘ఆశ ఎన్‌‌కౌంటర్’ చిత్రం జనవరి 1న రిలీజవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ, టికెట్ రేట్ల విషయంపై కూడా రియాక్టయ్యారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించడం తప్పు. వస్తువైనా, సినిమా అయినా తయారీదారుడికి రేటు నిర్ణయించే హక్కు ఉంది. రేటు ఎక్కువైతే కొనాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం. తాము చెప్పిన రేటుకే అమ్మాలని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదు. ఏపీ ప్రభుత్వం కావాలనే చేస్తోందా, కక్ష సాధింపుగా చేస్తోందా అనేది తెలియదు కానీ, టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల హీరోలకు వచ్చే నష్టమేమీ లేదు. ఇలాంటి చర్యలతో హీరోల ఫైనాన్షియల్ రూట్స్‌‌ దెబ్బతీయడం అసాధ్యం. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల నిర్మాతలకు మాత్రమే నష్టం. ప్రేక్షకులు థియేటర్స్‌‌కి వచ్చేదే హీరోల కోసం కనుక నిర్మాతలెవరూ హీరోల రెమ్యునరేషన్‌‌ని తగ్గించరు’ అని చెప్పారు వర్మ. ఇక మూవీ గురించి  మాట్లాడుతూ ‘ఎన్ని చట్టాలు చేసి ఎంత కఠిన శిక్షలు వేసినా నిర్భయ, దిశ లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. నేరస్థులను శిక్షిస్తే సరిపోదు. గతంలో ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేనివాళ్లు ఒక్క రోజులో ఇలా రాక్షసులుగా ఎలా మారారు, రేపిస్టుల సైకాలజీ ఎలా ఉంటుంది అనే విషయాల్ని కూడా స్టడీ చేయాలి. ఈ సినిమా అదే చెప్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి  ఆనంద్‌‌ చంద్ర దర్శ కుడు. అనురాగ్ కంచర్ల నిర్మాత.