న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు నర్సింగ్ హోమ్స్లోనూ ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని, నిరాకరించడం చట్టరీత్యా నేరమని తెలిపింది. ఆ సందర్భంలో చట్టపరమైన అనుమతులు ఏవీ అక్కర్లేదని, బాధితుల పరిస్థితిని బట్టి చికిత్స అందించాలని వెల్లడించింది. ఉచితంగా చికిత్స చేయడానికి నిరాకరించిన డాక్టర్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ ప్రతిభా సింగ్, జస్టిస్ అమిత్ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఓ కేసులో తీర్పు వెలువరించింది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు అత్యవసరంగా వైద్యం అందించాల్సి ఉంటుందని.. కానీ వాళ్లకు సరైన సమయంలో ఫ్రీ ట్రీట్ మెంట్ అందడం లేదని బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ఫ్రీ ట్రీట్ మెంట్ అందించేందుకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సు అక్కర్లేదని, ఇది వాళ్లకు సీఆర్పీసీ సెక్షన్ 357సీ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 397 కింద కల్పించిన చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది.
‘‘రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ఎలాంటి మెడికల్ ఫెసిలిటీలో అయినా సరే ఫ్రీ ట్రీట్ మెంట్ అందించాలి. ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి పంపకూడదు. అవసరమైన టెస్టులు చేయాలి. అవసరమైతే ఆస్పత్రిలో చేర్చుకుని ట్రీట్మెంట్ అందించాలి. ఏదైనా ఆపరేషన్ అవసరమైతే చేయాలి. ఫిజికల్, మెంటల్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. బాధితుల ఫ్యామిలీకి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి. వాళ్లకు మానసికంగా భరోసా కల్పించాలి” అని తీర్పులో వెల్లడించింది.
అన్ని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టాలి..
తమ ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టాలని కోర్టు తీర్పులో పేర్కొంది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తామంటూ ఆస్పత్రుల ఎంట్రెన్స్, రిసెప్షన్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే తాము ఇచ్చిన ఆదేశాలను లైంగిక దాడుల కేసులను విచారించే కోర్టులకు పంపించాలని సూచించింది. పోక్సో, క్రిమినల్, ఫ్యామిలీ కోర్టులకు తీర్పు కాపీలను పంపాలని చెప్పింది. ఈ కేసులు విచారించే కోర్టులు బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.