పుట్టుకతో వచ్చే లోపాన్ని ఒక శాపంగా ఫీలవుతుంటారు చాలామంది. ఆ నిరాశతోనే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ, తమ ప్రమేయం లేకుండా కలిగే వైకల్యాన్ని పట్టించుకోవడం ఎందుకంటాడు సీన్ స్టీఫెన్సన్. తన లైఫ్ జర్నీలో డిప్రెషన్‌కి గురైన వందల మందిని తన మాటల మాయాజాలంతో మార్చేశాడాయన.
అమెరికన్ రచయితగా, మోటివేషనల్ స్పీకర్‌గా, హిప్నోథెరపిస్ట్గా.. ఇలా ఎన్నో విషయాలతో వరల్డ్ ఫేమస్ అయిన వ్యక్తి సీన్ స్టీఫెన్సన్. చికాగోలో 1979, మే5న పుట్టాడాయన. పుట్టుకతోనే ‘ఒస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా’ అనే జెనెటిక్ డిజార్డర్ బారినపడ్డాడు. ఆ డిజార్డర్ వల్ల బాడీ సున్నితంగా తయారైంది. ఎముకలు పెలుసుగా మారి.. విరిగిపోతుంటాయి. ఇలా బోన్ ఫ్రాక్చర్ ప్రాబ్లమ్‌తో పుట్టిన కండిషన్ చూసి పుట్టిన కొన్నిగంటలకే అతను చనిపోతాడని అనుకున్నారంట డాక్టర్లు. కానీ, ఆశ్చర్యంగా.. అదృష్టవశాత్తూ బతికాడతను. కానీ, ఆ వ్యాధి ప్రభావం అతని జీవితాంతం వెంటాడింది.
జీవితమే ఓ పుస్తకం
ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న కుటుంబం అతనిది. అయితే దాతల సాయంతో అతనికి ట్రీట్మెంట్ కొన్నేండ్లపాటు కొనసాగింది. కొంచెం పక్కకు కదిలినా సరే.. అతని బాడీలో ఎముకలు విరుగుతుండేవి. 18 ఏండ్లు వచ్చేసరికి అతనికి 200సార్లు ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి. అంతేకాదు ఆ జెనిటిక్ డిసీజ్ ఎఫెక్ట్‌తో రెండు అడుగుల 8 ఇంచుల వద్దే అతని హైట్ ఆగిపోయింది. ఈ అరుదైన సమస్య వల్ల అతను చనిపోయేంత వరకు వీల్ ఛైర్‌కే అంకితం అయ్యాడు. ఆ నొప్పి ఓర్చుకుంటూనే ఇంటి వద్దే హైస్కూల్ దాకా చదువును కొనసాగించాడు సీన్. 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు కాలేజీలో ఒకసారి ఒక ఈవెంట్లో లైఫ్ గురించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. అది చూసి అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్ష్, స్టీఫెన్‌సన్‌ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. టోనీ శిష్యరికంలో మరింత రాటుదేలాడు స్టీఫెన్సన్. ఇరవై ఏండ్ల వయసుకే ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్ అవతారం ఎత్తాడు సీన్ స్టీఫెన్సన్. ఆ వృత్తిని కొనసాగిస్తూనే డీపాల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ టైంలోనే ‘హై యూ(త్) కెన్ సక్సీడ్’ అనే బుక్ రాశాడు. ఆ బుక్కి పాజిటివ్ రియాక్షన్ దక్కింది. దీంతో 2009లో తన ఆటోబయోగ్రఫీ ‘బట్’ని రాశాడు. పుట్టుకతో లోపం ఉండి.. ఆ నిరాశతో సూసైడ్ చేసుకునేవాళ్లకు డెడికేట్ చేస్తూ ఆ బుక్‌ని రిలీజ్ చేశాడాయన. ఆ ఏడాది అమెరికాలో టాప్ సెల్లింగ్ బుక్‌గా ‘బట్’ రికార్డు క్రియేట్ చేసింది. అదే ఏడాది ‘ది బయోగ్రఫీ ఛానెల్’ వాళ్లు అతని జీవితాన్ని ‘త్రీ ఫుట్ జెయింట్’ పేరుతో టెలికాస్ట్ చేశారు. జీవిత కాలం మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు దక్కించుకున్న సీన్ స్టీఫెన్సన్.. కిందటి ఏడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ వీల్‌ఛైర్ నుంచి కిందపడిపోయాడు. ఆ యాక్సిడెంట్‌లో తలకి గాయమై.. కొన్నిరోజులకే కన్నుమూశాడు.
తనకు తానుగా..
సీన్ స్టీఫెన్సన్ ఎలాంటి స్పీచ్ ఇచ్చినా సరే ‘మనిషి జీవితం ఒక వరం. దానిని మధ్యలోనే ముగించడం మూర్ఖత్వం’ అని చెప్పి మరీ ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవడం పిరికిపందలు చేసే పని అని ఆయన అభిప్రాయం. అందుకే ఏ నలుగురిని కలిసినా నవ్వుతూ.. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడతాడు. బిల్ క్లింటన్, బిల్ లిపింస్కి లాంటి ఎందరో పొలిటీషియన్లపై కూడా ఈ వీల్‌ఛైర్ మాంత్రికుడి స్పీచ్‌ల ప్రభావం ఉందంటే అతిశయోక్తికాదు. 2001లో మోటివేషనల్ స్పీకర్ అయిన మిండె నిస్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడాయన. ప్రస్తుతం సీన్ స్టీఫెన్సన్ పేరు మీద ఆమె ప్రోగ్రామ్స్ రన్ చేస్తోంది. ‘‘తప్పులు చేయడానికి నేనెప్పుడూ భయపడను. అలా ఉన్నందుకే నా జీవితం అద్భుతంగా ఉంది’’. ‘‘మనిషి అన్నాక నొప్పి తప్పదు’’. అది ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది కూడా. ‘‘మీరు ఎలా ఉన్నా సరే.. ప్రేమించేవాళ్లు దొరుకుతారు. వాళ్లతో పోటీపడి మీరు ప్రేమించండి’’.. ఇలా ఆయన చెప్పిన కొట్స్ వందలకొద్దీ ఉన్నాయి. బహుశా ఆయన స్థానంలో వేరే ఎవరు ఉన్నా.. అంత ఆత్మవిశ్వాసంతో బతికేవారు కాదేమో అంటారు ఆయన అభిమానులు. వ్యక్తిగతంగా పనుల కోసం ఇతరుల సపోర్ట్ తీసుకున్నా.. మానసికంగా మాత్రం ఆయనకు ఆయనే సపోర్ట్‌గా ఉండేవాడు. అందుకే చనిపోయినా కూడా ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఆయన జీవితపాఠం నలుగురికి స్ఫూర్తిని ఇస్తోంది.