7 ఒక్కటే కాదు.. 6, 8 బ్లాకులనూ మళ్లీ కట్టాల్సిందే? మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక రెడీ

7 ఒక్కటే కాదు.. 6, 8 బ్లాకులనూ మళ్లీ కట్టాల్సిందే? మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక రెడీ
  • రిపోర్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం
  • నేడో రేపో రాష్ట్రానికి​అందే అవకాశం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ ఒక్కటే మళ్లీ కడితే సరిపోదా? పక్కన ఉన్న బ్లాకులనూ మళ్లీ కట్టాల్సిందేనా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన తుది నివేదికలో ఇదే అంశాన్ని పేర్కొన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏడో బ్లాక్‌‌తో పాటు 6, 8 బ్లాకులను మళ్లీ కట్టాల్సి ఉంటుందని ఫైనల్​ రిపోర్టులో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. 

ఏడో బ్లాక్ కుంగడంతో దాని పక్కన బ్లాకులపైనా ప్రభావం పడిందని.. ఆ బ్లాకులు కూడా ఎంత వరకు పటిష్టంగా ఉంటాయన్నది చెప్పలేమని రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ తన ఫైనల్​రిపోర్టును రాష్ట్ర సర్కారుకు గురువారం లేదా శుక్రవారం అందించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పటికే ఆ రిపోర్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్​సంతకం కూడా చేశారని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఢిల్లీ టూర్​సందర్భంగా దీనిపై కేంద్రమంత్రితో చర్చించినట్టు తెలిసింది. 

అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ రిపోర్టులోని కొన్ని కీలకాంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఏడో బ్లాకును కూల్చడమూ కొంత సవాలుతో కూడుకున్నదేనని, బ్యారేజీ అలైన్‌‌మెంట్​దెబ్బతినకుండా చూసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన చోట గ్రౌటింగ్​చేసి ఎవిడెన్సులు మాయం చేసేలా చేశారని తుది నివేదికలో ఎన్డీఎస్ఏ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయాలను రిపోర్టులో నిపుణుల కమిటీ చెప్పినట్టు సమాచారం. 

రక్షణ చర్యలు తీసుకోకుంటే దిగువన గ్రామాలకు ముంపు ముప్పు తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకుల అలైన్‌‌మెంట్​దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసినట్టు సమాచారం. ఎగువన, దిగువన 2డీ, 3డీ మోడల్​స్టడీస్​ చేయించి.. రక్షణ చర్యలను చేపట్టాలని పేర్కొన్నట్టు తెలిసింది.