Team India: కెప్టెన్‌గా కాదు.. స్ఫూర్తినింపే నాయకుడిగా ఉండాలనుకుంటున్నా..: సూర్య

Team India: కెప్టెన్‌గా కాదు.. స్ఫూర్తినింపే నాయకుడిగా ఉండాలనుకుంటున్నా..: సూర్య

తనదైన టైమింగ్‌, వినూత్న షాట్లతో ప్రేక్షకులను అలరించే భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మనసులో మాట బయటపెట్టాడు. జట్టుకు కెప్టెన్‌గా కాకుండా.. జట్టులో స్ఫూర్తినింపే నాయకుడిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అచ్చం ఇవే మాటలు ఒకప్పుడు భారత మాజీ కెప్టెన్ ధోని అన్నారు. అతను జట్టును నడిపించే విధానం, సహచరులు స్పందించే తీరుపై ప్రశ్నలు ఎదురవ్వగా.. తాను జట్టుకు కెప్టెన్‌గా కాదని, జట్టులో లీడర్ అని బదులిచ్చారు. నాలుగేళ్ల తరువాత సూరీడు.. అవే మాటలు మరోసారి గుర్తుచేశాడు. 

శనివారం(జనవరి 25) చెన్నై వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు హాట్‌స్టార్ నిర్వహించే 'సూపర్ స్టార్స్'లో పాల్గొన్న సూర్య.. తాను జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనుకోలేదని, జట్టును ఏకం చేసే.. స్ఫూర్తినిచ్చే నిజమైన నాయకుడిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు.

ALSO READ | గంభీర్ తిట్టడంలో పెద్ద సిద్ధహస్తుడు.. గంగూలీని లెక్కచేసేవాడు కాదు: భారత మాజీ క్రికెటర్

"జట్టులో కెప్టెన్‌ పాత్రకు పరిమితం కాకూడదు అన్నది నా అభిప్రాయం. నేను నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. జట్టుగా మనం ఏదైనా సాధించాలంటే అందరం ఒకే మాట మీద ఉండాలి. కెప్టెన్‌గా నేను సహచరులకు చెప్పే చిన్న చిన్న విషయాలు ఇవే.. బేసిక్స్. మైదానంలో, మైదానం వెలుపల అనుసరించాల్సిన మంచి అలవాట్ల గురించి పదే పదే చెప్తుంటా.. ఒకసారి మైదానంలో అడుగుపెట్టాక ఆలోచనలు వద్దని చెప్తుంటా.. మారుతున్న పరిస్థితులను ఆస్వాదించమని చెప్తుంటా.." అని సూర్య వెల్లడించాడు. 

ఈడెన్ గడ్డపై భారీ విజయం

బుధవారం ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్‌ను 132 పరుగులకే కట్టడిచేసిన టీమిండియా.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.